Credit Score Rules: పేమెంట్ ఒకరోజు ఆలస్యమైతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా? ఈ రూల్స్ తెలుసుకోండి
క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ ఒక రోజు ఆలస్యమైతే లేదా ఏదైనా వాయిదా చెల్లించడంలో ఒక్కరోజు ఆలస్యమైతే, క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందా అని కొందరు ఆలోచిస్తుంటారు. అయితే దీనికి వేర్వేరు నియమాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి.
దేశంలో చాలా బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలు 30 రోజుల కంటే తక్కువ ఆలస్యాన్ని లేట్ పేమెంట్ కేటగిరీలోకి తీసుకోవు. అంటే మీరు ఒక్క రోజు ఆలస్యంగా చెల్లింపు చేస్తే స్కోర్‌పై దాదాపు ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది నివేదికలో కూడా నమోదు చేయరు.
సాధారణంగా బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ కస్టమర్లకు కొద్దికాలం గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తాయి. అంటే మీ చెల్లింపు గడువు సోమవారం అయితే మీరు మంగళవారం చెల్లిస్తే ఆలస్యంగా పరిగణించరు. అయితే మీ బ్యాంక్ పాలసీ ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటేనే దీనిపై క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రతి బ్యాంకు రూల్స్ ఒకే తీరుగా ఉండవు.
ఒకరోజు ఆలస్యంగా చెల్లిస్తే స్కోరుపై ప్రభావం చాలా వరకు ఉండకపోవచ్చు. కానీ ఆలస్య రుసుము (Late Fees) మాత్రం వసూలు చేస్తారు. బ్యాంకులు, కార్డ్ కంపెనీలు మీరు చెల్లించాల్సిన బిల్లు ఆధారంగా మీ పెనాల్టీ ఆధారపడి ఉంటుంది. కానీ ఇది అలవాటుగా మారితే, మీకు జరిమానాలు ఛార్జీలు పెరుగుతాయి. అత్యవసర సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
సాధారణంగా పేమెంట్30 రోజుల కంటే ఎక్కువ ఆలస్యంగా పెండింగ్‌లో ఉన్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ క్షీణిస్తుంది. అదే సమయంలో బిల్లు పేమెంట్ కనుక 60 లేదా 90 రోజులపాటు ఆలస్యం అయితే, అది క్రెడిట్ స్కోర్‌ను చలా తగ్గిస్తుంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.
మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు గడువు తేదీని మరచిపోతున్నారా.. అందువల్లే మీరు చెల్లింపు చేయలేకపోతే, మీ ఖాతాలో ఆటో డెబిట్ సర్వీస్ ప్రారంభించవచ్చు. దాంతో సకాలంలో బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. 30 శాతానికి మించి క్రెడిట్ లిమిట్ వినియోగించినప్పుడు సైతం క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.