Sri Padmavathi Ammavari Brahmotsavam 2024: మోహినీ అలంకారంలో అలమేలుమంగ- అమ్మవారిని చూసి పరవశించిపోయిన భక్తులు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఈవో జె.శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.