Micro Artist : పండగ ఏదైనా ఆయన చూసే స్టైల్ డిఫరెంట్.. అందుకే నెల్లూరులో ఫేమస్
నెల్లూరు నగరానికి చెందిన ముసవీర్ సూక్ష్మమైన బంగారు వస్తువుల్ని, జ్ఞాపికలను తయారు చేస్తూ అందరితో శేభాష్ అనిపించుకుంటున్నారు. ఈ సూక్ష్మ కళలో నెల్లూరు జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన సొంతం. 1 గ్రాము 400 మిల్లీగ్రాముల బరువు ఉండే బంగారంతో.. జాతీయ గీతంలోని అన్ని అక్షరాలను రూపొందించి అరుదైన రికార్డ్ సృష్టించారు ముసవీర్.
బంగారం ఆభరణాలను అతి సూక్ష్మంగా రూపొందించడంలో ముసవీర్ దిట్ట
నెల్లూరు పక్షుల పండుగ సందర్భంగా ముసవీర్ తయారు చేసిన ఫ్లెమింగోస్ కి అరుదైన గుర్తింపు లభించింది. కను రెప్పపై నిలబడేలా ఆయన తయారు చేసిన తాజ్ మహల్ నమూనా నిజంగా అద్భుతం.
అమ్మకానికి పెట్టలేదని, కళను అమ్ముకోబోనని చెబుతారాయన. ప్రభుత్వ సాయం ఉంటే.. తన కళారూపాలతో ఎగ్జిబిషన్ పెట్టాలనే ఆలోచన ఆయనకు ఉంది.
క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా కప్ నమూనాను సూక్ష్మమైన జ్ఞాపికగా తయారు చేసి టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు చెప్పడంతో ముసవీర్ సూక్ష్మ స్వర్ణ కళ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు అందరు స్వర్ణకారులలాగే తాను కూడా ఆభరణాలు తయారు చేసేవాడు. ఆ తర్వాత మాత్రం అతను కేవలం సూక్ష్మమైన జ్ఞాపికల తయారీకే పరిమితం అయ్యారు.
సూక్ష్మ కళతో అందరి దృష్టినీ ఆకర్షించిన ముసవీర్ కి అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని వచ్చాయి. జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఆయనకు సత్కారాలు కూడా దక్కాయి.
సంక్రాంతి అయినా, రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా.. అన్ని మతాల పండగలకు తన జ్ఞాపికలతో శుభాకాంక్షలు చెబుతుంటారు ముసవీర్.
1 గ్రాము 400 మిల్లీగ్రాముల బరువు ఉండే బంగారంతో.. జాతీయ గీతంలోని అన్ని అక్షరాలను రూపొందించి అరుదైన రికార్డ్ సృష్టించారు ముసవీర్.
ఇప్పటి వరకు 30 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాలనేదే తన జీవితాశయం అంటారు ముసవీర్