Kadapa Latest News: కడప - బద్వేల్ మార్గంలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం
కడప - బద్వేల్ రహదారి మార్గంలో లంకమల అటవీ ప్రాంతంలో ఉన్న కల్వర్టు కూలిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ మార్గాన్ని ఉపయోగించే ప్రయాణికులకు అంతరాయం కలగకుండా, తక్షణమే ప్రత్యామ్నాయ రహదారిని సిద్ధం చేయాలని ఇప్పటికే R&B శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.
కడప- సిద్ధవటం- బద్వేల్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారి ద్వారా హెవీ వెహికల్స్ కూడా ప్రయాణించగలిగేలా రోడ్డు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కడప - బద్వేల్ రహదారి మార్గంలో లంకమల అటవీ ప్రాంతంలో కల్వర్టు కూలిపోవడంతో R&B శాఖ ఇప్పటికే ప్రత్యామ్నాయ రహదారి పనులను ప్రారంభించడంతో పాటు, జంగిల్ క్లియరెన్స్, రోడ్ లెవెలింగ్ పనులను కూడా పూర్తి చేసింది.
అదే సమయంలో, కూలిపోయిన కల్వర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా.. ఇందుకోసం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వం వద్దకు పంపాలని అధికారులను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు.