Pawan Kalyan: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ వరుస భేటీలు, ఇంతకీ ఏం చేశారంటే!
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకం (MGNREGS)లో భాగంగా చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ మంగళవారం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో పలు కీలకమైన అంశాలపై చర్చించారు. ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్ ను పెంచడం ఎంతో ప్రయోజనకరమన్న పవన్ కళ్యాణ్.. రూ.2081 కోట్ల కూలీల వేతన సొమ్ము విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
గిరిజనుల కోసం కాఫీ తోటల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉపాధి పనుల్లో భాగంగా పిఎమ్ ఆవాస్ యోజన (PM Awas Yojana) ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజులు పని దినాలు ఉంటాయి. అదనంగా 100 రోజుల పని దినాలు కల్పించాలని కేంద్రాన్ని పవన్ కోరారు. అధునాతన వాటర్ షెడ్ల నిర్మాణ పథకంలో భాగంగా ఏపీకి 59 ప్రాజెక్టులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఏపీలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని, అయితే పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందన్నారు. 2,230 గ్రామాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాల్సి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు.
పిఠాపురం పట్టణ పరిధిలోని V-V సెక్షన్‌లో, సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో రైల్వే కి.మీ 640/ 30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కి బదులుగా ఆర్‌ఓబీ అవసరమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశంలో పవన్ కళ్యాణ్ కోరారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాలను ప్రధానమంత్రి 'గతి శక్తి' కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.
పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 4 ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు విజ్ఞప్తి చేశారు. నాందేడ్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, నాందేడ్ - సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం - న్యూఢిల్లీ)కి, విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ లకు పిఠాపురంలో హాల్ట్ అవసరమని కేంద్రానికి పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన పార్టీ ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ ఉన్నారు.
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాపూర్వకంగా విందుకు ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ లతో కలిసి వెళ్లి ఉప రాష్ట్రపతి ఇచ్చిన విందును స్వీకరించారు.