CM Chandrababu: శపథం నెరవేరిన వేళ సగర్వంగా అసెంబ్లీలోకి సీఎం చంద్రబాబు - సభ రేపటికి వాయిదా, తొలి రోజు బెస్ట్ మూమెంట్స్ ఇవే!
తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి వస్తున్న క్రమంలో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేశారు.
ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చాకే సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లారు.
అనంతరం అసెంబ్లీ ద్వారం వద్ద కొబ్బరి కాయ కొట్టి లోపలికి అడుగుపెట్టారు.
అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబుకు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
సీఎం చంద్రబాబుకు శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
అనంతరం సభలో నవ్వుతూ అడుగుపెట్టిన సీఎం సభ్యులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం చేయించారు.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆత్మీయంగా పలకరించారు.
సీఎం చంద్రబాబు సభలో అడుగుపెట్టిన సమయంలో 'నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గౌరవ సభకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది.