YV Subba Reddy on YS Sharmila: సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సుబ్బారెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు మరోసారి సీఎం జగన్‌నే సీఎం అవ్వాలని అనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని అన్నారు. ఎవరు కూటములు కట్టినా తమకు ఏ మాత్రం భయం లేదని అన్నారు. గురువారం (జనవరి 4) మీడియాతో మాట్లాడారు. షర్మిల వైసీపీలో చేరే అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారని అన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. 


షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎవరు ఏ పార్టీలో చేరినా.. ఎన్ని పార్టీలు మారినా తమకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని సుబ్బారెడ్డి అన్నారు. జగన్ కాకుండా మరొకరు ఏపీకి ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని సుబ్బారెడ్డి అన్నారు. అందుకే ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోకేశ్ నావ మునిగి పోయిందని అయినా జాకీలు వేసి లేపుతున్నారని ఎద్దేవా చేశారు. అయినా లోకేశ్ పైకి లేవడం లేదని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీలో పార్టీ అధిష్ఠానం గెలుపు కోసం చేస్తున్న మార్పుల గురించి కూడా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని, అన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని అన్నారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని.. కానీ పార్టీ మాత్రం గెలుపైనే ఫోకస్ చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.