Chandrababu arrest over Skill Development Scam:
టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి లోబడి పని చేస్తానని చెప్పి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ప్రజలు సిగ్గు పడే విధంగా బాబు వ్యవహరించారని, షెల్ కంపెనీలు సృష్టించి మోసం చేశారని ఆరోపించారు.
మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే.. ‘సిమెన్స్ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా ఫండ్స్ డైవర్ట్ చేశారు. సత్య హరిశ్చంద్రుడు అని చెప్పుకునే చంద్రబాబు ఇంత పెద్ద స్కామ్ చేశారని ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. మోసం చేసిన వారిని అరెస్ట్ చెయ్యకపోతే పోలీసులు ఇంకెం చేస్తారు. అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్ లో 10 వేల ఎకరాల ల్యాండ్ మాఫియా చేసిన వ్యక్తి చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్ట్ పై టెండర్లు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో పనులు ఇచ్చి బాబు అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబుకు నూకలు చెల్లాయి. అనుభవజ్ఞుడు కాబట్టి 2014 లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారు. కానీ ఫైబర్ నెట్, స్కిల్ అమరావతి పేరుతో చంద్రబాబు అనేక స్కామ్ లు చేశారు. విదేశాల్లో ఉన్న కొందరిని ఇంటర్ పోల్ సహాయంతో విచారణ చేస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. పార్లమెంట్ లో సైతం చంద్రబాబు మోసాన్ని లేవనెత్తుతామని’ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
మరికాసేపట్లో కుంచనపల్లి సిట్ ఆఫీసుకు చంద్రబాబు!
అరెస్టయిన చంద్రబాబును పోలీసులు తాడేపల్లిలోని కుంచనపల్లికి తరలించనున్నారు. సిట్ ఆఫీసులో చంద్రబాబును విచారించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. టీడీపీ అధినేత తరలింపుతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబును తరలిస్తున్న మార్గంలోనూ రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేకువజామున అరెస్టు చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం నంద్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళాశక్తి పథకాలను వివరించేందుకు మహిళలతో మాట్లాడారు. సాయంత్రానికి బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు స్థానికంగా ఉండే ఓ ఫంక్షన్ హాల్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు.
నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఉన్న ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చాలా హైడ్రామా నడిచింది. శుక్రవారం సాయంత్రం నుంచే ఆయన్ని అరెస్టు చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీన్ని టీడీపీ వర్గాలు, పోలీసులు ఖండించినప్పటికీ వేకువజామున చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మార్గాన చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్నారు.