Kapu Ramachandra Reddy: వైసీపీలో టికెట్ దక్కని వాళ్లకి కాంగ్రెస్ లో తలుపు తెరుచుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఊపిరి పోసుకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని తేల్చేశారు. అందులో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముందు వరసలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్సిపీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చిన నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రామచంద్ర రెడ్డి కి టికెట్ ఇవ్వటం కుదరదు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలపడంతో కాపు రామచంద్ర రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.


తాడేపల్లి సీఎంవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసుకు సెల్యూట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వైఎస్ఆర్సిపీకి రాజీనామా చేస్తున్నట్లు కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి, తన భార్య కాపు భారతి రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీలో ఉంటాం అని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వారు స్వతంత్రులుగా పోటీ చేస్తారా లేక ఏదైనా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారని రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది. 


దీనికి అనుగుణంగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాపు రామచంద్ర రెడ్డికి కలిసి వచ్చింది. రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి, భార్య కాపు భారతి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత సీడబ్ల్యుసీ మెంబర్ రఘువీరారెడ్డి సొంత ఊరు అయిన నీలకంఠాపురంకు కాపు రామచంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లారు. 


నీలకంఠాపురంలోని నిలకంఠేశ్వర ఆలయంలో కాపు రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీడబ్ల్యూసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డితో రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని రఘువీరారెడ్డితో తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డిని కలవడంతో రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి దంపతులు షర్మిల నాయకత్వంలో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గలనుంచి నుంచి పోటీ చేస్తానని గట్టిగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.