Kaleswaram Investigation With Sitting Judge  : కాళేశ్వరంపై న్యాయవిచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి . ఆ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ప్రభుత్వం  నుంచి లేఖ వెళ్లింది.  మేడిగడ్డపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీకి సిట్టింగ్‌ జడ్డిని కేటాయించాలని  ప్రభుత్వం అధికారికంగా లేఖ ద్వారా కోరింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు ? ఏం చేశారు ? కాంట్రాక్టు ఎలా ఫైనల్‌ అయ్యింది ? నిర్మాణంలో లోపాలు  అనే అంశాలపై   జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇలాంటి వాటికి హైకోర్టు న్యాయమూర్తుల్ని కేటాయిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ చేయించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది.                                                             


ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ పని ప్రారంభించారు. మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.                         


హైదరాబాద్ తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 12 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో అధికారుల బృందం రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 


ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. ఇటీవల మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటించింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశీలన అనంతరం ఒక స్తంభం 1.2 మీటర్ల మేర కుంగిపోయినట్లు తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోవడంపై విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైకోర్టు సీజే నుంచి వచ్చే స్పందనను బట్టి కాళేశ్వరంపై తదుపరి విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది.