YSRCP Political Meeting in Bhemili: ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రధాన పక్షాలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అధికార వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ సాధికార బస్సు యాత్ర పేరుతో ఇప్పటికే వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి సీఎం జగన్మోహన్‌రెడ్డి పంపించారు. సీఎం కూడా సంక్షేమ పథకాల నిధుల విడుదల కార్యక్రమాన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూనే విడుదల చేస్తున్నారు. పూర్తిగా ఎన్నికల సదస్సులను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఈ నెల 27న భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. సుమారు మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు వైసీపీ నాయకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జన సమీకరణపై అగ్ర నాయకులు దృష్టి
సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు నిర్వహిస్తున్న తొలి సదస్సు కావడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సుమారు మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని వైసీపీ నిర్ణయించింది. ఒక్కో సచివాలయం నుంచి కనీసం వంద మందిని తీసుకువచ్చేలా అగ్రనాయకులు లోకల్ నాయకులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. సదస్సు నేపథ్యంలో వైసీపీ కీలక నాయకులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్ నియోజకవర్గాలు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం కూడా మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. సభను విజయవంతం చేసేలా జనాలను సమీకరించాలని సూచించారు. తొలి ఎన్నికల సభ కావడంతో పార్టీ నాయకులు కూడా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయడంపై దృష్టి సారించారు.
కీలక ప్రకటనకు అవకాశం
సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో వచ్చే ఎన్నిలకు సంబంధించిన కీలక హామీలను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామన్న దానిపై సీఎం ఇక్కడ ప్రకటించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో తయారీలో పార్టీ కీలక నాయకులు నిమగ్నమై ఉన్నారు. మేనిఫెస్టో అమ్ముల పొదిలోని కీలక అస్ర్తాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి బీమిలి సభ వేదికగా ప్రకటించే చాన్స్ ఉందని చెబుతున్నారు. అది రైతు రుణమాఫీయా..? లేక మరో అంశమా..? అన్నది తెలియాల్సి ఉంది.
కేడర్‌తో మాటామంతీ..
ఈ సభ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాటామంతీ నిర్వహించే అవకాశముందని చెబుతున్నారు. కొంత మంది కార్యకర్తలతో సీఎం ఇష్టాగోష్టిగా చర్చించడంతోపాటు స్థానికంగా ఉన్న ఇబ్బందులను తెలుసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో మాట్లాడేందుకు కొంత మంది నాయకులను ఎంపిక చేస్తున్నట్టు చెబుతున్నారు.