YS Sharmila Comments: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్టీపీ వైఎస్ షర్మిల ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేశారు. డీఐజీ ర్యాంక్ ఆఫీసర్‌తో విచారణ జరిపిస్తామని సీబీఐ డైరెక్టర్ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధే ఉంటే సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. దివంగత వైఎస్ఆర్ రూ.38వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 16లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. సీఎం కేసీఆర్ డిజైన్లు మార్చి, పేరు మార్చి రూ.1.20 లక్షల కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచారని చెప్పారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని ప్రాజెక్టుకు.. కరెంట్ బిల్లులే వేల కోట్లు కడుతున్నారని ఆరోపించారు. 


కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే మునిగిపోయింది..


వైఎస్ఆర్ నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెద‌ర‌కుండా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. కేసీఆర్ క‌ట్టిన కాళేశ్వ‌రం మూడేళ్లకే మునిగి పోయిందన్నారు. నాణ్యత లేని పనులు చేసినా కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కేసీఆర్, ఆ కంపెనీ ప్రజల సొమ్మును పీక్కుతిన్నారని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులో అడుగ‌డుగునా ఇంజినీరింగ్ లోపాలు క‌న‌ప‌డుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం ఒక ఏటీఎంలా ప‌ని చేస్తుంద‌ని, కాళేశ్వ‌రంతో వేల కోట్లు సంపాదించారని చెప్తున్నా కేంద్ర బీజేపీ పెద్ద‌లు ఎందుకు విచార‌ణ జ‌రిపించ‌డం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదని అడిగారు. బీఆర్ఎస్‌కు ‘బీ’ టీంగా బీజేపీ పనిచేస్తుందా అని ప్రశ్నించారు షర్మిల. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ప్రజల సొమ్ము కాపాడడం కోసం కాళేశ్వరం అవినీతిపై ఆఖరి వరకు పోరాడుతామన్నారు. ఇలాంటి అవినీతి, అక్రమాలు దేశానికి పాకక ముందే మొదట్లోనే తుడిచేయాలన్నారు.


రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఓ కంపెనీకే ఎందుకు ఇస్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఒకే కంపెనీకి అన్ని ప‌నులు ఎందుకు క‌ట్ట‌బెడుతున్న‌ారంటూ అన్నారు. వాళ్లకు కేసీఆర్‌కు మ‌ధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటని.. కాళేశ్వ‌రం స్కాం దేశంలోనే అతి పెద్ద‌దని అన్నారు. కేంద్రానికి సంబంధించిన శాఖల నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు స‌మ‌కూరాయని గుర్తు చేశారు. యావ‌త్ దేశ ప్ర‌జ‌ల సొమ్ముతో క‌ట్టిన ప్రాజెక్టు కాళేశ్వ‌రం అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జ‌ర‌గాల్సిందేనన్నారు.  


మునుగోడుపై..


మునుగోడు ఉపఎన్నిక ప్ర‌జాస్వామ్య‌ బ‌ద్ధంగా రాలేదని వైఎస్ షర్మిల తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక ఎమ్మెల్యేతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకుంటే ఈ ఉపఎన్నిక‌ వ‌చ్చిందని అన్నారు. అయిదేళ్లు సేవ చేస్తాన‌ని వాగ్ధానం చేసిన ఎమ్మెల్యే మ‌ధ్య‌లోనే త‌న స్వార్థం కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అహంకారం చాటుకోవ‌డానికి ఉపఎన్నిక‌లో వేల కోట్లు డ‌బ్బు ఖ‌ర్చు చేస్తోంది. మునుగోడు ఉపఎన్నిక ప్ర‌జ‌ల కోసం వ‌చ్చిన ఎన్నిక కాదని... ఇది మూడు పార్టీల మ‌ధ్య వీధిలో కుక్క‌ల కోట్లాట‌లా ఉందన్నారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్ చార్జిగా వ్యవహరించడం ఏంటని అన్నారు.  ఒక్కో ఓటుకు వేల రూపాయ‌లు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాల‌న ఇలానే కొన‌సాగితే తెలంగాణ రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అవుతుందన్నారు.


బీఆర్ఎస్ పై..


తెలంగాణ‌లో మ‌ద్యం ఏరులై పారుతోందని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. మ‌ద్యం అమ్మ‌కాల‌తోనే రాష్ట్రం న‌డుస్తుందని విమర్శించారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌పుడు మ‌ద్యంపై రూ.10వేల కోట్లు ఉన్న ఆదాయం నేడు రూ.40వేల కోట్ల‌కు పెరిగిందన్నారు. మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. రైతులు, నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు రెట్టింప‌య్యాయని గుర్త చేశారు. ఇచ్చిన హామీల‌న్నీ అట‌కెక్కాయన్నారు. ఇప్పుడు ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకు బీఆర్ఎస్ అంటూ కొత్త నాట‌కం ఆడుతున్నారన్నారు. బీఆర్ఎస్ అంటూ బార్ అండ్ రెస్టారెంట్ స‌ర్వీస్ పార్టీ అనే అనుకోవాలి అంటూ వైఎస్ షర్మిల వివరించారు.