Security breach at Salman Khan house: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఇంట్లో సెక్యూరిటీ లోపం బయటపడింది. సల్మాన్ ఖాన్ ఉండే ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ యువతి చొరబడింది. రెండు రోజుల పాటు ఈ ప్రయత్నం చేసింది. అయినా సెక్యూరిటీ వాళ్లు అడ్డుకోలేకపోయారు. ఓ యువతితో పాటు మరో వ్యక్తి కూడా సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ అపార్టుమెంట్ లోకి చొరబడిన మహిళను ఈశా ఛబ్రాగా గుర్తించారు. ఆమె వయస్సు 32 సంవత్సరాలు ఉంటుంది. ఆమె సల్మాన్ ఖాన్ యొక్క గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లిఫ్ట్ వద్ద ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. ద్రా పోలీసులకు అప్పగించారు. బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎందుకు సల్మాన్ ఇంట్లోకి చొరబడాలనుకుంటున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు.
మే 20 వతేదీన మధ్యాహ్నం జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి కూడా సల్మాన్ ఖాన్ యొక్క అపార్ట్‌మెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అతను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తాను సల్మాన్ ఖాన్ అభిమానిని అని కలవడానికి వచ్చానని చెబుతున్నాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు ఘటనలు 48 గంటల వ్యవధిలో జరిగాయి. సల్మాన్ ఖాన్ Y+ కేటగిరీ భద్రత లోపాలను బయట పెట్టింది.
2024 ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల కాల్పులు జరిగాయి. అప్పటి నుంచి సల్మాన్ భద్రతను పెంచారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో భద్రతా లోపాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2018లోకూడా ఓ మహిళ సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి చొరబడి, తాను సల్మాన్ ఖాన్ యొక్క భార్య అని ప్రకటించుకుంది. అప్పట్లో కేసు పెట్టకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.