Ramdev Baba Apologies: 'అలాంటి ఉద్దేశం నాకు లేదు'- ఆ వ్యాఖ్యలపై బాబా రాందేవ్ క్షమాపణలు

ABP Desam   |  Murali Krishna   |  28 Nov 2022 12:31 PM (IST)

Ramdev Baba Apologies: మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు.

రాందేవ్ బాబా క్షమాపణలు

Ramdev Baba Apologies: మహిళలపై యోగా గురువు బాబా రాందేవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆయన క్షమాపణలు కోరారు. మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని రాందేవ్ అన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు.

మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తున్నాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.             -  బాబా రాందేవ్‌, యోగా గురువు 

నోటీసులు

దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు.

ఇదీ జరిగింది

మహారాష్ట్రలోని ఠానెలో మహిళల కోసం గత వారం ఓ యోగా సైన్స్ క్యాంప్‌ నిర్వహించారు బాబా రాం దేవ్. ఆ సమయంలో అందరూ సల్వార్ సూట్‌లతో వచ్చారు. దీనిపై స్పందించిన రామ్ దేవ్‌ బాబా "మరే ఇబ్బంది లేదు. మీరు ఇంటికి వెళ్లి చీరలు కట్టుకోవచ్చు" అని అన్నారు. అంతటితో ఆగకుండా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

"మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగానే కనిపిస్తారు. నా కళ్లకైతే...వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలతో షాక్ అయిన ఆమె...ఆ అసహనాన్ని బయట పెట్టకుండా అలా నవ్వుతూ ఊరుకున్నారు. ఆమెతో పాటు అక్కడ సీఎం ఏక్‌నాథ్ శిందే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ శిందే కూడా అక్కడే ఉన్నారు.

Also Read: Watch Video: అదే పనిగా టీవీ చూస్తోన్న చిన్నారి- వింత శిక్ష వేసిన తల్లిదండ్రులు!

 

Published at: 28 Nov 2022 12:22 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.