విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని దూషించారంటూ కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలను తీసుకుని చంద్రబాబు ఇంటి ముట్టడికి వెళ్లారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కర్రలు, జెండాలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. వాళ్లు వస్తున్న సంగతి తెలుసుకున్న పోలీసులు భారీగా తరలి వచ్చారు. అదే టైంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా చంద్రబాబు ఇంటికి వలయంగా ఏర్పడ్డారు. అటు నుంచి వైసీపీ కార్యకర్తలు, ఇటు నుంచి టీడీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, వైసీపీ నుంచి జోగి రమేష్ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
చంద్రబాబు ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చమని చెబుతున్నారు జోగి రమేష్. టీడీపీ నేతలే తమపై దాడి చేశారని జోగి రమేష్ ఆరోపించారు. తన కారును టీడీపీ నేతలు పగుల గొట్టారని తెలిపారు. చంద్రబాబు తనపై దాడి చేయించారని విమర్శించారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో పడుకోవడం కాదు దమ్ముంటే బయటకు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారాయన. చంద్రబాబు, ఆయన కొడుకు సంగతి చూస్తామని హెచ్చరించారు. తీవ్ర స్థాయిలో రచ్చ అయిన తర్వాత పోలీసులు జోగి రమేష్‌ను అక్కడ్నుంచి తీసుకెళ్లారు.
జోగి రమేష్ కార్యకర్తలతో వచ్చిన విషయం తెలిసి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్పటికప్పుడు తరలివచ్చారు. దీంతో తీవ్ర ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికొకరు కర్రలతో కొట్టుకున్నారు. జోగి రమేష్ అరెస్టు తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు.
నర్సీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి కౌంటర్‌గా వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటి ముట్టడికి వచ్చారు.
ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని వైసీపీ నేత జోగి రమేష్ ముందే చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడి టైంలో కూడా వైసీపీ కేడర్ తమను కొడుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత తప్పనిసరి అన్నట్లుగా వైసీపీ కార్యకర్తలను అక్కడ్నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని వాపోతున్నారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం, ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.