Wrestlers Protest:


ఢిల్లీలో ఉద్రిక్తత 


ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణ తలెత్తింది. నిరసనకారులంతా ఒక్కసారిగా కొత్త పార్లమెంట్‌వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బారికేడ్లు తొలగించారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా...అక్కడి వాతావరణం వేడెక్కింది. సాక్షి మాలిక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బజ్‌రంగ్ పునియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మమ్మల్నందరినీ కాల్చి పారేయండి" అంటూ మండి పడ్డారు. పార్లమెంట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని భావించినా...పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చిన వెంటనే ఆందోళనకారులు బారికేడ్లు ఎక్కారు. తాము ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తుంటే అనవసరంగా అలజడి సృష్టించారని ఆరోపిస్తున్నారు. "మహిళా పంచాయత్" పేరిట నిరసన కార్యక్రమంగా చేపట్టగా రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 


"ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ని ప్రారంభిస్తున్నారు. మరో వైపు ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు మాకు మద్దతు తెలిపిన వారిని అరెస్ట్ చేశారు. వెంటనే వాళ్లందరినీ విడుదల చేయాలి. మేం పోరాడేది మా ఆత్మగౌరవం కోసం"


- బజ్‌రంగ్ పునియా, రెజ్లర్ 










అటు ఢిల్లీ పోలీసులు మాత్రం అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతు సంఘాలు కూడా రెజ్లర్లకు మద్దతు తెలిపాయి. వాళ్లు కూడా వస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించిన పోలీసులు ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు. ఢిల్లీ సరిహద్దులోనే కొన్ని వాహనాలను ఆపేశారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.