Wrestlers' Protest: 



జంతర్‌ మంతర్ వద్ద నిరసనలు 


ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చ (SKM) దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రెజ్లర్లకు మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో ఒక్కసారిగా రైతు సంఘాల నేతలు జంతర్‌మంతర్‌ వద్దకు రావడం వల్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్, హరియాణా నుంచి రైతు సంఘాల నేతలు ఢిల్లీకి వచ్చారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు మద్దతునిచ్చారు. వెంటనే ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు కీర్తి కిసాన్ యూనియన్‌ నేతలూ రెజ్లర్లతో పాటు నిరసన తెలిపారు. ఇప్పటికే హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ రెజ్లర్లకు సపోర్ట్‌గా ఉంటామని ప్రకటించారు. దేశమంతా ఇప్పుడీ అంశం గురించి మాట్లాడుకుంటోందని తేల్చి చెప్పారు. పలు సంఘాలు తమకు మద్దతునివ్వడంపై బజ్‌రంగ్ పునియా స్పందించారు. 


"ప్రజల నుంచే కాకుండా అన్ని సంఘాల నుంచి మాకు మద్దతు లభిస్తోంది. ఇంకా మాకు మద్దతుగా ఎంత మంది వస్తారో చెప్పలేం. అందరికీ మాదొక్కటే విన్నపం. ప్రశాంతంగా నిరసనలు చేపట్టండి. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటే అక్కడే కూర్చుని నిరసనలు చేయండి. మహిళా రెజ్లర్ల కోసం ఇంత మంది నిలబడడం చాలా సంతోషంగా ఉంది"


- బజ్‌రంగ్ పునియా, రెజ్లర్










పునియా స్టేట్‌మెంట్‌తో ఈ నిరసనలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయని స్పష్టత వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌, ఆప్‌ వీళ్లకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది జనవరిలోనూ నిరసనలు చేసిప్పటికీ...ఈ స్థాయిలో మద్దతు లభించలేదు. కానీ ఈ సారి మాత్రం రాజకీయ పార్టీల జోక్యంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపిస్తామని వెల్లడించారు. 


"కమిటీ వేయాలన్న డిమాండ్‌ని పరిగణనలోకి తీసుకున్నాం. ప్యానెల్‌ని కూడా నియమించాం. ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసులు పారదర్శకంగానే విచారణ జరుపుతున్నారు"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఏ ఆరోపణ నిజమని తేలినా ఉరి వేసుకుని చచ్చిపోతానని వెల్లడించారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నేళ్లలో ఏ ఒక్క అమ్మాయిని కూడా తప్పుడు ఉద్దేశంతో చూడలేదని వెల్లడించారు. 


Also Read: దేశం సంక్షోభంలో ఉంటే మీకు ఫారిన్ టూర్‌లు అవసరమా? బిలావల్‌పై ఇమ్రాన్ ఆగ్రహం