China Poverty Videos: 


పేదరికమే లేదట.. 


"చైనాలో అంతా బానే ఉంది" అని పదేపదే డప్పు కొట్టుకుంటుంది అక్కడి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా మీడియా కూడా అదే స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. నిజానికి అలా ప్రచారం చేయకపోతే సెన్సార్‌షిప్ పేరుతో మొత్తం ఛానల్‌నే బ్యాన్ చేసేస్తుంది జిన్‌పింగ్ ప్రభుత్వం. అక్కడి ఆంక్షలు అంత తీవ్రంగా ఉంటాయి మరి. దేశంలో ఏ సమస్య ఉన్నా...అది చూపించడానికి వీల్లేదని ముందుగానే తేల్చి చెబుతుంది. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ పేదిరకం దారుణంగా పెరుగుతున్నా అక్కడి మీడియా ఆ సమస్య గురించి చర్చించడానికే వీలు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని The New York Times రిపోర్ట్ చేసింది. ఇప్పుడీ అంశం మరోసారి తెరపైకి రావడానికి కారణం ఓ వైరల్ వీడియో. ఓ రిటైర్డ్ వ్యక్తి మాట్లాడిన ఆ వీడియో తెగ వైరల్ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆ వీడియోని వెంటనే ప్రభుత్వం డిలీట్ చేయించింది. డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఇలా దేశంలో ఎంతో మంది ఉన్నారంటూ ఓ సింగర్‌ వీడియో విడుదల చేసింది. 100 యువాన్‌లు ఖర్చు చేసినా సరుకులు రావడం లేదని ఆ వీడియోలు చెప్పింది. కేవలం పెన్షన్‌పైనే ఆధారపడి బతుకుతున్న తన లాంటి వాళ్లు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. 


"చిన్న చిన్న పనులు చేసుకునే వారి దగ్గరి నుంచి పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్లందరిదీ ఒకటే బాధ. డబ్బులు చాలడం లేదు. కొంత మంది ఆ పని దొరక్క ఆకలితో అల్లాడిపోతున్నారు. మా ముఖాల కన్నా జేబులే చాలా నీట్‌గా కనిపిస్తున్నాయి. అంత ఖాళీగా ఉన్నాయని అర్థం. ఏం చేసినా పూట గడవడమే కష్టంగా ఉంటోంది"


- బాధితురాలు 


డైరెక్ట్ వార్నింగ్..


గతేడాది కూడా ఓ వలస కూలీ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. కరోనా సోకిన తరవాత తాను, తన ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పాడు. ఇది వైరల్ అవడం వల్ల చాలా మందిలో సింపథీ క్రియేట్ అయింది. వెంటనే అలెర్ట్ అయిన ప్రభుత్వం ఆ వీడియో డిలీట్ చేసింది. ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులనూ ఏ జర్నలిస్ట్ కలవకుండా ఆంక్షలు విధించింది. ఇంత జరుగుతున్నా "మేం పేదరికాన్ని జయించాం" అంటూ జిన్‌పింగ్‌ 2021లోనే ప్రకటించారు. ఇంత వరకూ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదని అప్పుడప్పుడూ ఇలా వైరల్ వీడియోల రూపంలో ప్రపంచానికి తెలుస్తోంది. చాలా మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇంకొందరు దారిద్ర్య రేఖకు ఎగువన జీవిస్తున్నారు. కానీ ఇదంతా చూపించిన మీడియాపై ఆంక్షలు విధిస్తోంది ప్రభుత్వం. మీడియాలో కానీ..సోషల్ మీడియాలో కానీ ఎవరైనా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే వెంటనే వాటిని డిలీట్ చేస్తామని అధికారికంగానే ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు బాధగా మాట్లాడుతూ పోస్ట్ చేసిన వీడియోలనై అసలు సహించడం లేదు. చైనా గురించి అంతా పాజిటివ్‌గానే మాట్లాడాని డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇస్తోంది. 


Also Read: US Firings: అమెరికాలో మళ్లీ తుపాకీ కాల్పులు! ఏకంగా 9 మంది మృతి