Wrestlers Protest:
జంతర్ మంతర్ వద్ద ఆందోళన..
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు..న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి కదలమని స్పష్టం చేశారు. అయితే...కేంద్రం మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ "కమిటీ వేస్తాం" అని చెప్పినా ఆ నిర్ణయంతో న్యాయం జరగదు అని బాధితులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే వీరి నిరసనలకు పలు సంఘాలు మద్దతునిచ్చాయి. ఇప్పుడు యోగ గురు రామ్ దేవ్ బాబా కూడా వీళ్లకు సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. బ్రిజ్ భూషణ్‌పై అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
"రెజ్లింగ్ అసోసియేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయనను శిక్షించాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ఆయనని అరెస్ట్ చేయాలి. మన దేశ రెజ్లర్లు ఇలా రోడ్డు మీద కూర్చుని ఇన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ఖాతరు చేయకపోవడం సిగ్గుచేటు. ఇలా లైంగికంగా వేధించే వారిని జైల్లో పెట్టాల్సిందే. బ్రిజ్ భూషణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. అనవసరంగా రెజ్లర్లపై నోరు పారేసుకుంటున్నారు. ఇది కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన నేరమే"
- బాబా రామ్‌దేవ్
అటు బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశపూర్వకంగా ఈ నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి పంజాబ్, ఆపైన ఖలిస్థాన్, కెనడా వరకూ విస్తరిస్తోందని, ఇదంతా పెద్ద కుట్ర అని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కావాలనే నినాదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరచూ ట్విటర్‌లో రెజ్లర్లపై విమర్శలు చేస్తున్న ఆయన..ఇటీవల ఓ పోస్ట్ చేశారు. తాను నిర్దోషిని అని నిరూపించుకోడానికి లై డిటెక్ట్ (Polygraph Test) టెస్ట్‌కి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రెజ్లర్లు చేసే ఆరోపణలు నిజమా కాదా తేలాలంటే వాళ్లు కూడా ఈ టెస్ట్‌కి అంగీకరించాలని సవాలు విసిరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన అమ్మాయిలంతా నార్కో టెస్ట్‌కి (Narco Test) సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. బ్రిజ్ భూషణ్‌పై మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. అంతే కాదు. ఈ టెస్ట్‌ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరికీ చూపించాలనీ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ ప్రక్రియని మానిటర్ చేయాలని కోరారు. ఇప్పటికే బజ్‌రంగ్ పునియా బ్రిజ్ భూషణ్‌పై మండి పడ్డారు. పోలీసులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
"బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్‌కి సిద్ధమా అని సవాలు విసిరారు. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ...అదంతా సుప్రీంకోర్టు నేతృత్వంలోనే జరగాలి. దేశమంతా దాన్ని లైవ్‌లో చూడాలి"
- రెజ్లర్లు
Also Read: Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్