Army Dog Zoom Passes Away: 


మధ్యాహ్నం 12 గంటలకు మృతి..


ఇండియన్ ఆర్మీలోని "జూమ్" డాగ్ (Zoom Dog)మృతి చెందింది. శ్రీనగర్‌లోని వెటిర్నరీ హాస్పిటల్‌లో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న శునకం...చనిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూసినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అప్పటి వరకూ వైద్యానికి స్పందించిన జూమ్...ఉన్నట్టుండి పడిపోయిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లా టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో ఆర్మీ.. సోమవారం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని తొలుత భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో సైన్యం.. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్‌' అనే ఆర్మీ కుక్కను పంపారు. దీంతో 'జూమ్‌' ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా 'జూమ్' వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత అధికారులు 'జూమ్'ను  హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ 'జూమ్' శిక్షణ పొందిన నిబద్ధత కలిగిన వీర శునకమని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో 'జూమ్' నేర్పరి. 






గతంలోనూ..


ఆర్మీ డాగ్స్ డ్యూటీ చేస్తూ చనిపోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరివేసే పనిలో ఉన్న ఉగ్రవాదులు బారముల్లాలో ఈ ఏడాది జులైలో ఓ టెర్రరిస్ట్‌ను మట్టుబెట్టారు. ఈ క్రమంలోనే ఒకర్ని పోగొట్టుకున్నారు. అయితే కోల్పోయింది సైనికుడిని కాదు. ఉగ్రవాది జాడను కనిపెట్టిన శునకాన్ని. అంటే...ఈ శునకం కూడా తన విధులు నిర్వర్తించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంది. రెండు సంవత్సరాల వయసున్న కుక్క, వాసన చూసుకుంటూ ఉగ్రవాది జాడను కనిపెట్టింది. వెంటనే ఆ టెర్రరిస్ట్ గన్‌తో దానిపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు బుల్లెట్లు తాకటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. "యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాం. కానీ అంతకు ముందు యాక్సెల్‌ (కుక్క పేరు)ని కోల్పోయాం" అని సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాది పేరు అక్తర్ హుస్సేన్ భట్ అని, ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులతో సహా ఓ పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో యాక్సెల్ ప్రాణాలు కోల్పోయింది అని తెలిపారు. ఈ కుక్క ఉగ్రవాదిని పసిగట్టి వెళ్లుంటే ఎన్‌కౌంటర్ ముందుగానే ముగిసిపోయేదని అన్నారు సైనికాధికారులు. అంతకు ముందు జరిగిన పలు కీలక ఆపరేషన్లలో యాక్సెల్ పాల్గొందని, ఎంతో మంది ఉగ్రవాదులను పసిగట్టి వారిని హతమార్చటంలో సహకరించిందని చెప్పారు. ఆర్మీలోని శునకాలకు కొన్ని సందర్భాల్లో కెమెరాలు అమర్చి అనుమానిత ప్రదేశాలకు పంపుతారు. జీపీఎస్‌ ద్వారా ముష్కరులున్న లొకేషన్‌ని ట్రాక్ చేస్తారు. 


Also Read: Indian Railways: టికెట్ కన్ఫామ్ కాకపోయినా జర్నీ చెయ్యొచ్చు! ఎలాగో తెలుసా?