Bangladesh Army: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తన పదవి నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నారు. విద్యార్థి నాయకత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లాం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పనిచేయడం కష్టమని, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేనందున తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించలేనని మహమ్మద్ యూనస్ చెప్పారని నహీద్ ఇస్లాం అంటున్నారు. రాజకీయ పార్టీలు ఒక సాధారణ ఒప్పందానికి రాకపోతే నేను పనిచేయలేననని యూనస్ భావిస్తున్నారు.
అదే సమయంలో బంగ్లాదేశ్ సైన్యాధిపతి జనరల్ వాకర్-ఉజ్-జమాన్‌తో యూనస్‌కు విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. జమాన్ డిసెంబర్ 2025 నాటికి ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి చేస్తుండగా, యూనస్ ఎన్నికలను 2026 జూన్ వరకు వాయిదా వేయాలని అంటున్నారు. మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రానికి రహదారి ఏర్పాటు చేయాలనే యూనస్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆర్మీ చీఫ్ జమాన్ “సార్వభౌమత్వానికి ముప్పు”గా పేర్కొంటూ తిరస్కరించారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మే 22, 2025న ఢాకాలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఎన్నికల కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను డిమాండ్ చేసింది. BNP నాయకుడు ఖందకర్ మొషారఫ్ హుస్సేన్, ప్రజల అంచనాలను నెరవేర్చకపోతే తమ మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. NCP, జమాత్-ఎ-ఇస్లామీ వంటి ఇతర పార్టీలు కూడా ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, కొందరు సలహాదారుల తొలగింపు కోసం ఒత్తిడి చేస్తున్నాయి.
గత ఏడాది విద్యార్థి నిరసనల సమయంలో యూనస్‌కు సైన్యం మద్దతు ఇచ్చింది, కానీ ప్రస్తుతం సైన్యం ఎన్నికల వాయిదా, ఖైదీల విడుదల వంటి యూనస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియాలో యూనస్ రాజీనామా చర్చలు విస్తృతంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్టు 8, 2024న యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. అయన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగడానికి అలా చేస్తున్నారన్న అనుమానాలు కూడా బంగ్లాదేశ్‌లో ఉన్నాయి.