Worlds Expensive Camel : ఇస్లాం పవిత్ర మాసం రంజాన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభ కానుంది. ఈద్ రోజున సౌదీ అరేబియాలో ఒంటెలను బలి ఇవ్వడం మనందరికీ తెలిసిందే. అందుకే సౌదీ అరేబియా దేశంలోనే ఓ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒంటెగా చెప్పుకునే ఒంటెను కొనుగోలు చేశాడు. ఈ ఒంటె 7 మిలియన్ సౌదీ రియాల్ అంటే దాదాపు రూ.14.23 కోట్లకు అమ్ముడుపోయిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం, సౌదీ అరేబియాలో ఈ ఒంటె కోసం బహిరంగ వేలం నిర్వహించారు. వేలానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రారంభ వేలం రూ. 10 కోట్లు
ఈ వీడియోలో సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తి మైక్రోఫోన్ ద్వారా ఒంటెను వేలం వేయడాన్ని చూడవచ్చు. ఒంటె కోసం ప్రారంభ వేలం 5 మిలియన్ సౌదీ రియాల్ అంటే దాదాపు రూ. 10.16 కోట్లు నిర్ణయించారు. అయితే ఓ వ్యక్తి 7 మిలియన్ సౌదీ రియాల్స్‌కు వేలం పాడాడు. ఇంత ఎక్కువ ధరతో ఒంటెను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు. వీడియోలో ఒంటెను మెటల్ ఎన్‌క్లోజర్‌లో ఉంచడం మీరు చూడవచ్చు. సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తులు వేలంలో పాల్గొంటున్నారు. సౌదీ అరేబియాలో ఇంత ఖరీదైన ధరకు వేలం వేసిన ఒంటె ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒంటెగా గుర్తింపు పొందింది. ఈ ఒంటె చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ జాతి ఒంటెలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో ఈ జాతికి చెందిన ఒంటెలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల ప్రదర్శన సౌదీ అరేబియాలో జరుగుతుంది.
ఒంటెల అందాల పోటీలు
సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంగా ఉన్న కింగ్ అబ్దుల్ అజీజ్ లో ఒంటెల పండుగను ప్రతీ ఏడాది నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ఒంటెల అందాల పోటీలు నిర్వహిస్తారు. అందమైన ఒంటెల పెంపే వారికి రూ. 500 కోట్లు బహుమతి ఇచ్చి సత్కరిస్తారు. ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే నియమం విధిస్తారు. ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేత ఒంటెను నిర్ణయిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన ఒంటెల పోటీల్లో మోసాలను అరికట్టేందుకు అత్యధునిక టెక్నాలజీని వినియోగించారు. చాలా మంది ఒంటెల పెంపకం దారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్‌లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నం చేసి వాటిని హింసించినట్లు నిర్వాహకులు గుర్తించి ఆయా ఒంటెలను అనర్హత వేటు వేశారు. పెంపకందారులకు కఠిన జరిమానా విధించారు.