Monkeypox : ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్(Monkeypox) పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్ ను గ్లోబర్ హెల్త్ ఎమర్జెన్సీ(Gobal Health Emergency)గా ప్రకటించింది. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మంకీపాక్స్ ను అత్యయిక స్థితిగా ప్రకటించారు. 70 కంటే ఎక్కువ దేశాలలో మంకీపాక్స్ విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది అసాధారణ పరిస్థితి అని తెలిపింది. దీంతో మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ అరుదైన వ్యాధికి చికిత్స అందించడానికి మరింతగా పెట్టుబడులు పెట్టాలని, టీకాలు అభివృద్ధి చేయాలని డబ్ల్యూహెచ్వో సూచించింది.
దశాబ్దాల క్రితమే
మంకీపాక్స్ దశాబ్దాల క్రితం మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో గుర్తించారు. మే వరకు ఖండం దాటి పెద్దగా వ్యాప్తి చెందని మంకీపాక్స్ ఒక్కసారిగా విస్తరించడం ప్రారంభించింది. ఐరోపా, ఉత్తర అమెరికా ఇతర ప్రాంతాలలో డజన్ల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించడం అంటే మంకీపాక్స్ వ్యాప్తి ఒక అసాధారణ సంఘటనగా గుర్తించాలి. ఇది మరిన్ని దేశాలలోకి వ్యాపించవచ్చని, ప్రపంచ దేశాలు సమన్వయంతో వ్యవహరించాలని డబ్ల్యూహెచ్వో సూచించింది.
74 దేశాల్లో 16 వేల కేసులు
COVID-19 మహమ్మారి, 2014 వెస్ట్ ఆఫ్రికన్ ఎబోలా వ్యాప్తి, 2016లో లాటిన్ అమెరికాలో జికా వైరస్, పోలియో వంటి ప్రజారోగ్య సంక్షోభాల కోసం WHO ఇప్పటి వరకూ అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. గత నెలలో WHO నిపుణుల కమిటీ ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి ఇంకా అంతర్జాతీయ అత్యవసర పరిస్థితికి సమానం కాదని తెలిపింది. అయితే పరిస్థితిని పునఃపరిశీలించడానికి ప్యానెల్ ఈ వారం సమావేశమైంది. U.S. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, దాదాపు మే నుంచి 74 దేశాలలో 16,000 కంటే ఎక్కువగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
జంతువుల నుంచి మనుషులకు
మంకీపాక్స్ మరణాలు ఆఫ్రికాలో మాత్రమే రికార్డు అయ్యాయి. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ మరింత ప్రమాదకరమైన వెర్షన్ గా మారుతోంది. ప్రధానంగా నైజీరియా, కాంగోలో ఈ వెర్షన్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆఫ్రికాలో మంకీపాక్స్ ప్రధానంగా ఎలుకలు, అడవి జంతువుల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఇతర ప్రాంతాలలో మంకీపాక్స్ జంతువులతో లేదా ఆఫ్రికాకు వెళ్లని వ్యక్తులకు కూడా వ్యాపించింది. భారత్ లో ఇప్పటికే రెండు మంకీ పాక్స్ కేసులు నమోదు అయ్యాయి.