US Woman: అవసరం, ఆపద వస్తేనే మనలోని సృజనాత్మకత అయినా, ధైర్యమైనా, ఎవరు ఎలాంటి వాళ్లో తెలుస్తుంది. అవసరంలో ఉన్న వారు తమకు ఎదురైన కష్టాన్ని, సవాలును ఎదుర్కోవడానికి మనసు పెట్టి ఆలోచించి పరిష్కారం కనుగొంటారు. అలాగే ఆపద సమయంలోనే మనకెంత ధైర్యం ఉంది, ఎంత తెగువ ఉంది, మనలోని శక్తియుక్తులు ఏంటి అనేది బయటకు వస్తుంది. ఇది కొత్తగా పరిశోధకులు.. అధ్యయనాలు చేసో, పరిశోధనలు చేసో కనిపెట్టింది కాదు. చాలా కాలంగా పెద్దలు చెప్పే మాట. అలాంటి పరిస్థితిలో మనకు ఎదురయ్యేది. గదికి తలుపు బిగించి పిల్లిని కొట్టడానికి ప్రయత్నించినా అది తిరగబడుతుందని, తనను తాను కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ప్రాణాల మీదకు వస్తే.. ఆ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తాం, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం. అదే పని చేసింది అమెరికాలో ఓ వృద్ధురాలు. తన ఇంట్లో పడ్డ దొంగను ధైర్యంగా ఎదుర్కొంది. అంతటితో ఆగక మరో పని కూడా చేసింది. ఆ పని వల్లే ఆ వృద్ధురాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దేశవిదేశాల్లోని అనేక మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతలా ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే..
అమెరికాలోని మైనేలో నివాసం ఉంటోంది మార్జోరీ పెర్కిన్స్. తన వయస్సు 87 ఏళ్ల పైనే. జులై 26 వ తేదీన తన ఇంట్లోకి దొంగ వచ్చాడు. రాత్రి 2 గంటల సమయంలో మార్జోరీ నిద్ర నుంచి మేల్కోగా.. తన బెడ్ పక్కనే ఆ దొంగ నిల్చొని కనిపించాడు. షర్ట్, ప్యాంటు వేసుకోలేదు. చేతిలో కత్తిని పట్టుకుని నిల్చొని ఉన్నాడు. కత్తితో పొడుస్తానని ఆ వృద్ధురాలిని బెదిరించాడు. ఆ దొంగ అలా అనడంతోనే మార్జోరీ.. 'అతను నా మీద పడి పొడిచేందుకు ప్రయత్నిస్తే.. నేను అతడిని తన్నుతాను' అని మనసులో అనుకుంది. అలాగే అతనితో పోరాడటానికి సిద్ధపడింది. అతను తన మీద పడి కత్తితో పొడవకుండా ఉండేందుకు మధ్యలోకి కుర్చీ లాగింది. వెంటనే అతడు ఆ వృద్ధురాలి చెంపపై, నుదిటిపై కొట్టాడు. తర్వాత వంట గదివైపు నడిచాడు. అలా నడుస్తూ.. 'నాకు చాలా ఆకలిగా ఉంది' అని చెప్పినట్లు వృద్ధురాలు చెప్పుకొచ్చింది. ఆకలిగా ఉంది అనడంతో మార్జోరీ పెర్కిన్స్.. ఆ దొంగకు పీనట్ బట్టర్, హనీ క్రాకర్స్, ప్రోటీన్ డ్రింక్స్, టాంగేరిన్లను అందించింది.
ఆ దొంగ అవి తింటున్న సమయంలోనే మార్జోరీ పెర్కిన్స్ తన రోటరీ ఫోన్ నుంచి 911కు డయల్ చేసింది. పోలీసులు వచ్చే లోపే ఆ దొంగత అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పారిపోయే సమయంలో తన వస్తువులు అక్కడే మర్చిపోయాడు. కత్తి, షర్ట్, షూస్, మద్యం నింపిన వాటర్ బాటిల్ అక్కడే వదిలేసి పారిపోయినట్లు మార్జోరీ పెర్కిన్స్ తెలిపింది. దొంగను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా.. ఆకలిగా ఉన్న దొంగకు భోజనం పెట్టడంతో పెర్కిన్స్ అంతర్జాతీయ సెలబ్రిటీగా మారిపోయింది.
వృద్ధురాలు మార్జోరీ పెర్కిన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆధారాలు సేకరించి.. ఆ దొంగ గురించి గాలింపు చేపట్టారు. చివరికి ఆ దొంగను పట్టుకున్నారు. దొంగతనం, నేరపూరిత బెదిరింపు, దాడి, మద్యం సేవించడం వంటి అభియోగాలు మోపారు. అయితే ఆ దొంగ మైనర్ కావడంతో అతడి పేరు, ఇతర వివరాలేవీ పోలీసులు వెల్లడించలేదు. మార్జోరీ పెర్కిన్స్ నివసిస్తున్న ప్రాంతానికి కొన్ని బ్లాక్ ల దూరంలోనే యువకుడు ఉంటున్నట్లు అధికారు తెలిపారు.