Harvard University  : అమెరికాలో అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ 1636లో స్థాపించిన  హర్వర్డ్ యూనివర్సిటీ. ప్రపంచ నాయకులను ఏందరినో తయారు చేసి ఇచ్చిన విద్యాలయం హర్వార్డ్ విశ్వవిద్యాలయం. ఈ మధ్య ఈ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. ఆర్థిక పరమైన కోతలు విధిస్తున్నారు.

విద్యా, పరిశోధన, ప్రపంచ నాయకత్వాన్ని అందిస్తోన్న విద్యానిలయం

ప్రపంచంలో మేటి విద్యాసంస్థల్లో పేరెన్నికగన్నది హార్వర్డు విశ్వవిద్యాలయం. ఇది కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదు. నూతన ఆవిష్కరణల విజ్ఞాన వేదిక. ప్రపంచ నాయకులను తీర్చిదిద్దిన సామాజిక సేవానిలయం. నోబెల్, పులిట్జర్ బహుమతి గ్రహీతలను  అందించిన విద్యా పీఠం హర్వార్డ్ యూని వర్సిటీ. శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, రచయితలు, రాజకీయ నేతలు, వివిధ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునే తత్వవేత్తలు ఇక్కడ చదువుకున్న వారే. ప్రపంచంలోనే అత్యున్నత కోర్సులను ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టే విద్యా సంస్థ హర్వర్డ్. అత్యున్నత అధ్యాపక బృందం ఈ యూనివర్సిటీ సొంతం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఈ యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నిస్తారు. విద్య, వైద్య, విజ్ఞాన, సాంకేతిక, సామాజిక రంగాల్లో నిత్యం అత్యాధునిక పరిశోధనలు జరుగుతుంటాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలు ఇక్కడి నుంచి ప్రారంభమై ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు అవుతున్నాయంటే  అతిశయోక్తి కాదు.

గ్రేట్ పర్సనాలిటీస్‌కి కేరాఫ్ అడ్రస్ హర్వార్డ్ 

ప్రపంచ నాయకులకు హర్వర్డ్ యూనివర్సిటీ పుట్టిల్లు లాంటిది.  అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్, జాన్.ఎఫ్. కెన్నడీ, బరాక్ ఓబామా, జార్జి డబ్ల్యూ బుష్ వంటి అమెరికా అధ్యక్షులు ఇక్కడి నుంచి వచ్చిన వారే. ఇక విదేశీ నాయకుల విషయానికి వస్తే పాకిస్థాన్‌కు చెందిన బెనజీర్ బుట్టో ఇక్కడే చదువుకున్నారు. మైక్రో సాప్ట్ వ్యవస్థాపకులు బిలిగేట్స్, ఫేస్ బుక్ సహ వ్యవస్థాపుడు మార్క్ జుకర్ బర్గ్ చదువుకున్నది ఇక్కడే.  అస్కార్ విజేత నటి నటాలీ పోర్ట్మస్  హర్వర్డ్ పూర్వ విద్యార్థిగా ఉన్నారు. హెన్రీ కిసింజర్ వంటి దౌత్యవేత్తలు, నీల్ డిగ్రాస్ టైసన్ వంటి ప్రముఖ ఖగోళ శాస్త్రవ్తేత్తలు ఒకప్పటి హర్వార్డ్ పూర్వ విద్యార్థులే.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ చదువుకున్నవారే. ఇలా ప్రపంచ నాయకత్వానికి, ప్రపంచ సమస్యలకు పరిష్కార వేదికగా హర్వర్డ్ యూనివర్సిటీ  ఉంది.

ప్రముఖలే కాదు వారి పిల్లలు ఇక్కడే

ప్రస్తుతం ప్రపంచ ప్రముఖులే కాదు వారి పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. బెల్జియం యువరాణి ప్రిన్సెస్ ఎలిజబెత్ హర్వర్డ్ కెన్నడీ స్కూల్ లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేస్తున్నారు.  మన దేశ వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ పిల్లలు ధ్రువ్ గోయెల్, రాధికా గోయెల్ హర్వర్డు యూనివర్సిటీలో ఇన్ స్టంట్ బ్యాంకింగ్ రంగంపై విద్య అభ్యసిస్తున్నారు.  ఇలా మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి. ప్రపంచం దేశాల పిల్లలు, రాకుమారులు, రాకుమార్తెలు ఇక్కడే విద్య అభ్యసించడానికి ఇష్టపడతారు. అంతటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ హర్వర్డ్ యూనివర్సిటీ.

ట్రంప్ విమర్శలు, కోతలు - వాతలు ఏంటంటే ?

హర్వార్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గించాలన్నది ఆయన ప్రధాన ఆలోచన. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. దీన్ని 15 శాతంకు తగ్గించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. విదేశీ విద్యార్థుల్లో కొందరు అమెరికా దేశానికి ద్రోహం తలపెట్టే వారు ఉన్నారని, వారంతా ట్రబుల్ మేకర్స్ అని ఆరోపణలు చేశారు. దేశ భద్రతకు వీరు ముప్పు అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని షాపింగ్ కాంప్లెక్స్ బాంబులతో పేలి పోవచ్చని, అల్లర్లు దేశంలో చెలరేగవచ్చని ఇందుకు విదేశీ విద్యార్థులు కొందరు కారణం కావచ్చన్న వివాదాస్పద వ్యాఖ్యలు హర్వర్డ్ విద్యాలయం పై చేశారు.

నిధులను దుర్వినియోగం చేస్తోందటూ ట్రంప్ ఆరోపణలు

అమెరికా ప్రభుత్వం హర్వార్డ్ యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే వాటిని సక్రమంగా వినియోగించకుండా దుర్వినియోగం చేస్తోందని డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఆ ఆరోపణలే కాకుండా ట్రంప్ తొలి విడతగా 2.3 బిలియన్ డాలర్ల మేర నిధులపై కోత పెట్టారు. తాజాగా మళ్లీ  వంద మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను ట్రేడ్ స్కూల్క్ కు మళ్లించాలని ఇది మంచి నిర్ణయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 యూదు వ్యతిరేక కార్యకలపాలకు నిలయంగా హర్వార్డ్

 ఇజ్రాయేల్ - హమాస్  గొడవల్లో  హార్వర్డ్ యూనివర్సిటీ  యూదు వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారిందన్నది ట్రంప్ మరో ఆరోపణ.  హమాస్ కు అనుకూలంగా యూనివర్సిటీ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్వార్డ్ అడ్మినిస్ట్రేషన్ కూడా అడ్మిషన్ల విషయంలో మైనారిటీ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ  ఆరోపణలు చేస్తూ ఆర్థికంగా నిధుల విడుదలకు కోతలు విధించారు డోనాల్డ్ ట్రంప్.

ట్రంప్ తీరుపై నిరసనల వెల్లువ

ట్రంప్ చేసిన విమర్శలు, చర్యలను హర్వర్డ్ తో పాటు ఇతర యూనివర్సిటీలు తప్పుబట్టాయి. ఇది విశ్వవిద్యాలయాల స్వయం పతిపత్తికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించాయి. అమెరికా విద్యా విధానం ఇది కాదని, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశం ట్రంప్ ఆరోపణలకు అనుగుణంగా జరగదని ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ న్యాయస్థానంలో కేసు వేసింది. విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మసాచుసెట్స్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

పలు రాజకీయ అంశాలే ట్రంప్ నిర్ణయాలకు కారణమని ప్రపంచ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది మంచిది కాదని, హర్వార్డు యూనివర్సిటీపై తప్పుడు ఆరోపణలతో మచ్చ వచ్చేలా ట్రంప్ చర్యలు ఉండకూడదని అంటున్నారు.