Donald Trump: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ యుద్ధం ముగింపు ఎలా ఉంటుందన్న ఆందోళనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ సంక్షోభం దిశగా వెళుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది. జీ-7 దేశాధినేతల సదస్సు కెనడాలోని కననాస్కిస్‌లో జరుగుతోంది. ఈ సమావేశం నుంచి అర్థాంతరంగా ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్ళడం ఏదో జరుగుతుందన్న చర్చకు దారి తీసింది. ఆయన నేరుగా వైట్ హౌస్ లోని సిచ్యుయేషన్ రూమ్‌కు వెళుతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతకన్నా ముందు ట్రంప్ టెహ్రాన్ ప్రజలు "వెంటనే నగరాన్ని ఖాళీ చేయాలని" పిలుపునిచ్చారు, ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

Continues below advertisement


సిచ్యుయేషన్ రూమ్ అంటే?


సిచ్యుయేషన్ రూమ్ అనేది వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్‌లో, ఓవల్ ఆఫీస్ (Oval Office) కింద ఉండే కమాండ్ సెంటర్. ఇది అత్యాధునికమైనది, అత్యంత సురక్షితమైనది. కీలకమైన భద్రతా సమాచారాన్ని నిర్వహించడానికి, రహస్య చర్చలు జరపడానికి ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్. ఇది ఒక్క గది మాత్రమే కాదు. దాదాపు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పెద్ద కమాండ్ సెంటర్. ఇందులో కాన్ఫరెన్స్ హాళ్లు, ప్రైవేట్ ఆఫీసులు, కమ్యూనికేషన్ సెంటర్లు, వర్క్‌స్టేషన్లు కలిగిన సమూహం. అత్యంత కీలకమైన జాతీయ భద్రతా సమాచారంపై చర్చించడానికి లేదా ప్రపంచ దేశాలపై తీసుకునే కీలక నిర్ణయాలకు ఇది కేంద్రంగా చెప్పవచ్చు.


సిచ్యుయేషన్ రూమ్‌ను ఎందుకు ఉపయోగిస్తారంటే?




  • జాతీయ, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో: దేశీయ, అంతర్జాతీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, సైనిక ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఈ సిచ్యుయేషన్ రూమ్‌ను అమెరికా అధ్యక్షులు ఉపయోగిస్తారు. ఈ సందర్భాల్లో సమాచారం వేగంగా పొందడానికి, ఆ సమాచారాన్ని విశ్లేషించుకోవడానికి, అందుకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలను అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకునేందుకు ఈ సిచ్యుయేషన్ రూమ్ కేంద్రంగా పని చేస్తుంది.




  • అమెరికా అధ్యక్షుడి నిరంతర పర్యవేక్షణ కోసం: ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలు కావచ్చు, ఉగ్రవాద దాడులు, ఇతర అంతర్జాతీయ, జాతీయ సంక్షోభాలను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ సిచ్యుయేషన్ రూమ్‌ను వినియోగిస్తారు. దౌత్యవేత్తలు, అధికారులు, నిపుణుల సమాచారం, నిఘా ఏజెన్సీల రహస్య సమాచారం, సైనిక సమాచారం నిరంతరం ఈ రూమ్‌కు అందేలా ఏర్పాట్లు ఉంటాయి. వాటి ఆధారంగా ఇదే కేంద్రంగా అమెరికా అధ్యక్షుడు నిరంతరం ఆ సమాచారాన్ని, విశ్లేషణలను జరిపి నిర్ణయాలు తీసుకుంటారు.




  • సురక్షితమైన కమ్యూనికేషన్ సదుపాయాల కేంద్రం: సిచ్యుయేషన్ రూమ్‌లో అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటై ఉంటుంది. ఇందుకు అవసరమైన అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ రూమ్ నుంచే విదేశీ నాయకులతో అమెరికా అధ్యక్షుడు చర్చించే సదుపాయాలు ఉన్నాయి. ఇతర దేశాల దౌత్యవేత్తలతో, సైనిక కమాండర్లతో టెలికాన్ఫరెన్స్‌లు లేదా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకునే వ్యవస్థ ఈ సిచ్యుయేషన్ రూమ్‌లో ఉంటుంది. ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు పంపడానికి లేదా ఫోన్ కాల్స్ చేయడానికి అధునాతన కమ్యూనికేషన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.




  • నేషనల్ సెక్యూరిటీ మీటింగ్ కోసం: దేశ భద్రతకు సంబంధించిన సమావేశాలను ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ నిర్వహిస్తారు. దేశ రహస్యాలకు సంబంధించిన విషయాలను ఇక్కడ చర్చిస్తారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ ముఖ్య విషయాలను చర్చించే కీలక కేంద్రం సిచ్యుయేషన్ రూమ్.




సిచ్యుయేషన్ రూమ్ ఎప్పుడు, ఎందుకు ఏర్పాటయిందంటే?


1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ఆదేశాల మేరకు సిచ్యుయేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1961లో క్యూబాలో జరిగిన బే ఆఫ్ పిగ్స్ (Bay of Pigs) దాడి వైఫల్యం కారణంగా ఇది ఏర్పాటయింది. క్యూబాలో ఫిడేల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరిగిన సీఐఏ-క్యూబా ప్రవాసుల దళం సైనిక దాడి ఘోరంగా విఫలమైంది. ఇది అంతర్జాతీయంగా అమెరికా పరువు తీసే ఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. ఇందుకు నిఘా సమాచార లోపం, సరైన విశ్లేషణ జరగకపోవడం, సరైన సమాచారం సరైన సమయంలో అందకపోవడం, తప్పుడు ప్రణాళికలు తయారు చేయడం దీనికి కారణాలుగా గుర్తించారు. అంతే కాకుండా, అమెరికా నిర్ణయాలు ఫిడేల్ కాస్ట్రోకు ముందుగా తెలియడం వల్ల క్యూబా దీన్ని అడ్డుకోగలిగినట్లు గుర్తించారు.


భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ఒక సమగ్ర సమాచార, విశ్లేషణ చేసే కమాండ్ సెంటర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడి కీలక నిర్ణయాలు అత్యంత సురక్షితంగా, రహస్యంగా ఉండాలని భావించారు. ఇందుకోసం అమెరికా జాతీయ భద్రత వ్యవహారాలకు అత్యంత ముఖ్యమైన సిచ్యుయేషన్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఆధునీకరించారు. ఒక నివేదిక ప్రకారం, 2023లో ఏడాది పాటు దీన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఇందుకు దాదాపు 50 మిలియన్లు ఖర్చు చేసినట్లు సమాచారం. జాన్ ఎఫ్. కెన్నడీ నాటి నుండి నేటి వరకు ఈ సిచ్యుయేషన్ రూమ్ అనేక కీలక నిర్ణయాలకు సాక్షిగా నిలిచింది.


ప్రస్తుతం ఎందుకు ఈ రూమ్‌లోకి ట్రంప్ ఎందుకు వెళుతున్నారంటే?


ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర ఉద్రిక్తంగా మారుతోంది. పరస్పర దాడులతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, ఇజ్రాయెల్‌పై అణుదాడులకు తగ్గదే లేదన్న ఇరాన్ బెదిరింపులు ప్రపంచ నేతలందరినీ కలవరపరుస్తున్నాయి. ఇదే సమయంలో కెనడాలో జీ-7 సమావేశాల్లో ప్రపంచ నాయకులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చించారు. ఆ తర్వాత ఆయన సమావేశాల మధ్యలోనే అమెరికాకు పయనమవడం, అది నేరుగా సిచ్యుయేషన్ రూమ్‌కు వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ సంక్షోభాన్ని నివారించే దిశగా ఏం చేయాలి? ఇందులో అమెరికా ప్రయోజనాలు ఏంటి? అన్న అంశాలను చర్చించే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్‌లో తమ ప్రాంతీయ స్నేహ దేశాల నుంచి, నిఘా వర్గాల నుంచి, సైనిక వర్గాల నుంచి వచ్చే తాజా సమాచారం పొందడానికి, వాటిని విశ్లేషించుకోవడానికి ఈ సిచ్యుయేషన్ రూమ్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దౌత్యపరమైన ఒత్తిడి ఏ విధంగా పెంచాలి, ఆర్థికపరమైన ఆంక్షలు ఇంకా ఏమైనా విధించే అవకాశం ఉందా అన్న అంశాలను చర్చించవచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వలన చమురు సంక్షోభం, దీని ఫలితం అమెరికా తో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న చర్చ సాగే అవకాశం ఉంది. తాను తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, వాటి లాభనష్టాలు ఏంటి అనే అంచనాలపై చర్చలు జరపవచ్చు. ఈ రూమ్‌లోనే ఆర్థిక, విదేశీ దౌత్య అధికారులు, నిఘా ఏజెన్సీ అధికారులు, సైనిక అధికారులు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఈ సిచ్యుయేషన్ రూమ్‌లో పెంటగాన్ (రక్షణ శాఖ), సీఐఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, స్టేట్ డిపార్ట్‌మెంట్ (విదేశాంగ శాఖ) ల చీఫ్‌లందరూ ఇక్కడ అందుబాటులో ఉంటారు.


ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడికి దిగనుందా?


గత కొన్నేళ్లుగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కాని ఇరాన్ తాను శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి దిగింది. అయితే అది తాత్కాలికంగానే అణు కేంద్రాలను అదుపు చేసే దాడిగా మిలటరీ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదని అణు శక్తి సంస్థ అధ్యక్షుడు రఫాలే గ్రూసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ యుద్ధంలో రంగంలోకి దిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇరాన్ అణు కేంద్రాలను శాశ్వతంగా ధ్వంసం చేయగల అత్యంత శక్తివంతమైన బాంబర్లు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయని ప్రపంచ సైనిక నిపుణులు చెబుతున్నారు. నంతాజ్, ఫార్డో అణు కేంద్రాలను భూమిలోపల చాలా ఎక్కువ లోతులో నిర్మించారు. వీటిని పేల్చివేసే శక్తి ఇజ్రాయెల్ వద్ద లేదని చెబుతున్నారు. ఈ కేంద్రాలను పేల్చివేయాలంటే అమెరికాకు చెందిన జీబీయు-57 బంకర్ క్లస్టర్ బాంబులు వినియోగించాల్సి ఉంది. ఇవి దాదాపు 13,500 కిలోల బరువు ఉండే బాంబులు. వీటిని మోసుకెళ్లాలన్నా బి-2 స్పిరిట్ బాంబర్ విమానాలకు మాత్రమే సాధ్యం. ఇది ఇజ్రాయెల్ వద్ద లేదని, ఇదే అదనుగా ఇరాన్ అణు శక్తిని నిర్మూలించాలంటే అమెరికా కూడా రంగంలోకి దిగవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వార్‌లో తమ హస్తం లేదని చెబుతున్న అమెరికా ఇప్పుడు నేరుగా ఈ దాడులు చేస్తుందా లేక ఇజ్రాయెల్‌కు ఈ విషయంలో సాయం చేస్తుందా అన్న చర్చ సాగుతుంది. సిచ్యుయేషన్ రూమ్‌కు ట్రంప్ చేరుకున్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయా అన్న ఉత్కంఠలో ప్రపంచ దేశాలు ఉన్నాయి.