War Symptoms Between Iran And Israel: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏక్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్ పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందని అమెరికా నిఘా వర్గాల సమాచారంతో టెన్షన్ నెలకొంది. రానున్న 24 - 48 గంటల్లోపు ఏ క్షణమైనా ఈ దాడి జరగొచ్చని అమెరికా నిఘా వర్గాల సమాచారం. అటు, తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ దేశ ప్రధాని నెతన్యహూకు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా నిలిచింది. ఇప్పటికే మిత్ర దేశమైన ఇజ్రాయెల్ కు సహాయ సహకారాలు అందిస్తోన్న అమెరికా.. తాజాగా యుద్ధ నౌకలను సైతం రంగంలోకి దించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్.. నెతన్యహూకు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు.
ఇదీ జరిగింది
సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ ఇటీవల వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన సీనియర్ అధికారి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇరాన్ పగతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్ పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అమెరికా నిఘా వర్గాల అంచనాతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. అటు, ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చెయ్యొచ్చన్న సంకేతాలతో పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికాకు ఇరాన్ వార్నింగ్
మరోవైపు, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. నెతన్యహూను గుడ్డిగా నమ్మవద్దని.. ఒకవేళ జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులు, బాంబు దాడులకు ఇరాన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మధ్యధరా సముద్రంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు మోహరించాయి. క్షిపణులను ఎదుర్కోగలిగే యుద్ధ యంత్రాలను సైతం అమెరికా సిద్ధం చేసింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులు అంచనా వేసేందుకు యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్ తో కలిసి ఎరిక్ కొరిల్లా హెట్జోర్ వైమానికి స్థావరాన్ని సందర్శించారు. 'ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు. కానీ అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు.' అని యోయావ్ గలాంట్ అన్నారు.
అక్కడి పౌరులకు దేశాల హెచ్చరికలు
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఇరాన్, ఇజ్రాయెల్ కు ప్రయాణాలు చెయ్యొద్దని భారత పౌరులను విదేశాంగ శాఖ హెచ్చరించింది. అలాగే, ఇరాన్, ఇజ్రాయెల్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. కాగా, ప్రస్తుతం ఇరాన్ లో 4 వేల మంది, ఇజ్రాయెల్ లో 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. మరోవైపు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పని చేసేందుకు భారత్ నుంచి వెళ్తున్న కార్మికులకు అనుమతులు లభించవని తెలుస్తోంది.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు సైతం ఇరాన్, ఇజ్రాయెల్ లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్ ను వీడాలని ఫ్రాన్స్ ఆదేశించింది. శనివారం వరకు టెహ్రాన్ కు తమ విమాన సర్వీసులు నిలిపేస్తున్నట్లు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ గడువును గురువారానికి పొడిగించింది. మరోవైపు, బ్రిటన్ సైతం తమ పౌరులు తక్షణం ఇజ్రాయెల్ ను వీడాలని సూచించింది.
Also Read: పోషించే స్థోమత లేక భార్యతో పాటు ఏడుగురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి