Machado presented her nobel prize to Donald Trump | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కొరినా మచాడోను కలిశారు. వైట్‌హౌస్‌లో ఈ భేటీ సందర్భంగా మచాడో అమెరికా అధినేత ట్రంప్‌నకు తన నోబెల్ శాంతి బహుమతిని బహూకరించారు. వైట్ హౌస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇది ట్రంప్ వైఖరిలో పెద్ద మార్పుగా పరిగణించకూడదని కూడా స్పష్టం చేసింది.

వైట్ హౌస్ ఏం చెప్పింది..వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెనిజులా ప్రజల కోసం 'ధైర్యవంతురాలు, బలమైన స్వరంగా' ప్రతిపక్ష నాయకురాలు మచాడోను అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఈ సమావేశం పట్ల సానుకూలంగా ఉన్నారని ఆమె అన్నారు. అయితే, ట్రంప్ ఇప్పుడు మచాడోను వెనిజులా నాయకురాలిగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు, ట్రంప్ నిర్ణయం ఇప్పటికీ ఒకటేనని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మచాడోకు దేశంలో తగినంత మద్దతు లేదని ట్రంప్ భావిస్తున్నారని ఆమె తెలిపారు. 

ఎన్నికల గురించి ట్రంప్ వైఖరిభవిష్యత్తులో వెనిజులాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని డొనాల్ట్ ట్రంప్ కోరుకుంటున్నారని లెవిట్ చెప్పారు. అయితే, ఈ ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చో ఆమె చెప్పలేదు. ట్రంప్‌తో సమావేశం తర్వాత మచాడో మీడియాకు మాట్లాడుతూ.. ట్రంప్‌నకు తన నోబెల్ శాంతి బహుమతిని అందజేసినట్లు చెప్పారు. దీనిని 'మా స్వాతంత్ర్యానికి ఆయన ప్రత్యేక మద్దతుకు గుర్తింపు' అని మచాడో పేర్కొన్నారు.

మద్దతుదారులతో సమావేశంవైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మచాడో బయట నిల్చుని ఉన్న తన మద్దతుదారులను కలిశారు. 'మేము అధ్యక్షుడు ట్రంప్‌ను నమ్మవచ్చు.' దీనిపై ఆమె మద్దతుదారులు 'థాంక్యూ ట్రంప్' అని నినాదాలు చేశారు.

మదురో అరెస్టు తర్వాత మారిన వాతావరణంఈ సమావేశం రెండు వారాల కిందట అమెరికా సైన్యం వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను రాజధాని కారకాస్ నివాసం నుండి అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తరలించిన తరువాత జరిగింది. మదురో, ఆయన భార్యపై డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. మచాడో కూటమి 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు పేర్కొంది. కానీ అధ్యక్షుడు మదురో ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు.

ట్రంప్ వైరుధ్య వైఖరిట్రంప్ మచాడోను కలిసినప్పటికీ, గతంలో ఆమె నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారని తెలిసిందే. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. రోడ్రిగ్జ్ మాజీ ఉపాధ్యక్షురాలు, ప్రస్తుతం ప్రభుత్వ పాలన చూసుకుంటున్నారు.

అమెరికా-వెనిజులా సంబంధాలుఅమెరికా ప్రస్తుతం వెనిజులా చమురు రంగంపై ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల నిషేధిత చమురు ట్యాంకర్ సైతం స్వాధీనం చేసుకున్నారు. రోడ్రిగ్జ్ తాత్కాలిక ప్రభుత్వం అమెరికాతో సహకరిస్తుంని అమెరికా అధికారులు అంటున్నారు. దీని కింద ఈ వారం ఐదుగురు అమెరికన్ పౌరులను వెనిజులా విడుదల చేసింది. 

ట్రంప్, రోడ్రిగ్జ్ సంభాషణబుధవారం నాడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను డెల్సీ రోడ్రిగ్జ్‌తో చాలాసేపు మాట్లాడానని చెప్పారు. 'మేము అనేక సమస్యలపై చర్చించాము. ముఖ్యంగా అమెరికా, వెనిజులా సంబంధాలు సరైన దిశలో వెళుతున్నాయని భావిస్తున్నాను' అన్నారు.