USA Student Dies : వడదెబ్బ తగిలి మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అమెరికాలో ఒక‌ యూనివర్సిటీ భారీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. తమ కుమారుడి మృతికి అమెరికాలోని యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో సదరు యూనివర్సిటీ 14 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 110 కోట్లు) పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది.
 కుప్పకూలి మరణించాడు.


అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో ఆగస్ట్ 31 2020న రెజ్లింగ్‌కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గ్రాంట్‌ బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. అయితే, శిక్షణ స‌మ‌యంలో నార్కోలెప్సీ, ADHDతో బాధపడుతున్న బ్రేస్ కొండపైకి, కిందికి చాలాసార్లు పరుగెత్త‌డంలో బాగా అల‌సిపోయాడు. విప‌రీత‌మైన దాహంతో బాధ‌ప‌డుతూ మంచినీరు కావాల‌ని వేడుకుంటున్నప్పటికీ కోచ్‌లు అత‌ను నీరు తాగడానికి నిరాక‌రించారు. త‌న శారీర‌క ప‌రిస్థితిని వివ‌రించినా వైద్య స‌హాయాన్ని అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. శిక్షణలో భాగమని పేర్కొంటూ ఇత‌రులెవ‌రూ అతనికి నీరు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఫ‌లితంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతూ బ్రేస్ కొద్దిసేపటికే మరణించాడు. 


తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్ కుటుంబం కోర్టును ఆశ్ర‌యించింది. త‌మ‌ కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించడం వల్లే అతడు మృతి చెందాడ‌ని న్యాయ‌స్థానానికి బాధిత త‌ల్లిదండ్రులు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబానికి విశ్వవిద్యాలయం 14 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. బ్రేస్ అకాల మరణానికి చింతిస్తున్నామ‌ని, అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించామ‌ని. ఈ కేసు పరిష్కారంతో వారు స్వాంత‌న పొందుతార‌ని తాము ఆశిస్తున్నామంటూ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేసినట్లు విశ్వవిద్యాలయం ప్ర‌క‌టించింది.


"చట్టపరమైన ప్రక్రియలో ఈ సమస్యను త్వరగా పరిష్కరించడం వల్ల బ్రేస్ కుటుంబానికి ప్రశాంతత చేకూరుతుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం" అని విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జెర్రీ జాక్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.