వాషింగ్టన్: భారత్, చైనా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసి అమెరికా తన అసలు రంగు బయటపెట్టింది. భారతదేశంపై సుంకాలు పెంచడంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ఎక్కువ సుంకాలు విధించారని  అన్నారు. ట్రంప్ మొదట భారతదేశంపై 25 శాతం టారిఫ్ విధించారు, ఆ తర్వాత మరో 25 శాతం టారిఫ్ ప్రకటించడంతో మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం 25 శాతం టారిఫ్ అమలవుతుండగా, మరో వారం రోజుల్లో అదనపు 25 శాతం టారిఫ్ అమలు చేస్తామని అమెరికా చెబుతోంది.

వాస్తవానికి, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. మీడియా సమావేశంలో కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్, రష్యాల మధ్య నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి చాలా ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఆయన చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని రష్యాను పదే పదే కోరారు. కానీ తమ డిమాండ్లకు ఉక్రెయిన్ తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. దాంతో భారత్ పై సుంకాలతో మరోదారి వెతికారు ట్రంప్" అని తెలిపారు

ట్రంప్, జెలెన్స్కీ సమావేశంపై వైట్ హౌస్

ఇటీవల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. అదే రోజున, పలువురు ప్రముఖ యూరోపియన్ నాయకులు కూడా ట్రంప్‌ను కలిశారు. వారందరూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు. ఈ విషయంలో వైట్ హౌస్ మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్ వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు. నాటో సెక్రటరీ జనరల్ సహా యూరోపియన్ నాయకులందరూ వెళుతున్నారు. ఇది అధ్యక్షుడు ట్రంప్ గొప్ప చర్య అని వారందరూ అంగీకరించారు.

యూరోపియన్ నేతల గురించి వైట్ హౌస్ ఇలా 

ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ తర్వాత చాలా మంది ప్రముఖ యూరోపియన్ నాయకులను అధ్యక్షుడు కలిశారు. ఉక్రెయిన్‌కు భద్రతా హామీ ఇస్తానని ఆయన అన్నారు. ఈ విషయంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడారు. "అధ్యక్షుడు ట్రంప్‌నకు యూరోపియన్ నేతలందరూ కృతజ్ఞతలు తెలిపారు. జెలెన్స్కీకి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలిశారు. ఇక ఒకేసారి పుతిన్, జెలెన్‌స్కీలతో ట్రంప్ సమావేశం కానున్నారు. త్వరలోనే నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ముగిసిపోతుంది. యూరప్ దేశాల నేతలు, నాటో సైతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోవాలని భావిస్తోందని తెలిపారు.