US Iran War: పశ్చిమాసియా రణక్షేత్రం రగులుతోంది. అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ పెను విధ్వంసం చేస్తోంది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికా సైనికులపై విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్‌లతో మూకుమ్మడిగా దాడి చేస్తోంది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లు ప్రయోగించింది. ఈ దాడుల్లో దాదాపు 8 మంది మృతి చెందినట్టు ప్రసారం జరుగుతోంది.
ప్రతికారు దాడులు చేస్తున్న ఇరాన్
అమెరికా రాత్రి ఇరాన్‌పై విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్‌లో ఉన్న సైనికులను టార్గెట్ చేసింది. ఇలా ఒక దేశంపై ఒకరు టార్గెట్ చేసుకోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందా అనే టెన్షన్ ఆ ప్రాంత దేశాల్లో నెలకొంది. మరోవైపు హోర్మూజ్ జలసంధిలో ఎగుమతులకు అనుమతి లేదని ఇరాన్ చెప్పడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాను టార్గెట్ చేసుకున్న ఇరాన్, దానికి మద్దతు ఇచ్చిన దేశాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే జోర్దాన్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను జోర్డాన్ దళాలు కూల్చేశాయి. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ ప్రకటించింది. అయితే తాము అమెరికాకు చెందిన ఫ్యూయల్ సప్లై విమానాలు, యుద్ధ విమానాలను టార్గెట్ చేసినట్టు తెలిపింది. ఇందులో చాలా వాటిని నాశనం చేశామని ఇరాన్ రివల్యూషన్ గార్డ్ ప్రకటించింది. అమెరికా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని జోర్డాన్ ప్రజలకు ఇరాన్ పిలుపునిచ్చింది. వారికి సహకరిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యతవహించాలని అన్నారు.
అమెరికా స్థావరాలపై దాడులు చేశామన్న ఐఆర్‌జీసీ
ఇరాన్‌పై దాడి చేసి సైనికుల హత్యకు కారణమైన అమెరికా టార్గెట్ చేస్తున్నట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది. అందులో భాగంగా సిరియాలోని అల్ తాన్ఫ్‌లో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్ కమాండ్ కేంద్రంపై దాడి చేశామని తెలిపారు. అయితే దీనికి తగిన ఆధారాలు చూపించం లేదు.
ఉత్తర ఇరాన్‌లో దాడులు- 9 మంది మృతి
ఉత్తర ఇరాన్‌లో కూడా దాడులు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో అటానమస్‌గా ప్రకటించుకున్న కుర్దిష్ ప్రాంతంలోని ఇర్బిల్, సులైమానియాలో కూడా బాంబులు పేలుళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఇరాన్ కుర్దిష్ తిరుగుబాటుదారులను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది ఈ అటాక్‌లో దాదాపు 9 మంది చనిపోయినట్టు, మరికొందరు గాయపడినట్టు చెబుతున్నారు.
బలగాలను వెనక్కి తీసుకున్నట్టు అమెరికా ప్రకటన
అయితే ఇరాన్ దాడులు చేస్తున్నట్టు చెప్పిన ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. సిరియా, జోర్దాన్, ఇరాక్ సరిహద్దుల్లోని అల్తానుఫ్‌లో అమెరికా సైనికులు లేరని తెలిపింది. మరోవైపు ఈ ఘర్షణలకు దూరంగా ఉండాలని సిరియా భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇదే విషయాన్ని సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్‌షారా గతంలోనే కీలక ప్రకటన చేశారు. తమపై దాడి చేస్తే తప్ప వేరే దేశాలపై దాడుల గురించి స్పందించబోమని వెల్లడించింది. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై తమ పట్టు సడలిపోలేదని ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడులు చేస్తున్నంత కాలంలో జలసంధి మీదుగా ఎలాంటి ఎగుమతులు జరిగేందుకు అనుమతించబోమని ప్రకటించింది.
