వాషింగ్టన్: అమెరికా ఏవియేషన్ ఇండస్ట్రీలో అతిపెద్ద సమస్య తలెత్తింది. అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పిలుపు మేరకు దేశంలోని అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికా అంతటా ఎయిర్‌పోర్టులలో ఫ్లైట్లను గ్రౌండ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 11 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు శుక్రవారం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీఎన్ఎన్ ప్రకారం, ఎయిర్ కంట్రోల్ సెంటర్లలో కమ్యూనికేషన్ సమస్య వల్ల విమానాలు నిలిపివేశారు. ఈ సమస్య నెట్వర్క్ రౌటర్లో వచ్చిన లోపంతో మొదలైందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) అధికారులు వెల్లడించారు. 22 ప్రాంతీయ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో సమస్య తలెత్తడంతో దాని ప్రభావం అమెరికా అంతటా కనిపించింది. తదుపరి సమాచారం వచ్చేవరకు దేశంలో అన్ని ఫ్లైట్లపై నిషేధం విధించినట్లు ఎఫ్ఏఏ తెలిపింది.
'అన్ని ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లను ప్రభావితం చేసిన కమ్యూనికేషన్ సమస్య కారణంగా FAA అన్ని అమెరికా విమానాశ్రయాలను విమాన సర్వీసులను నిలిపివేయాలనే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం FAA టెక్నీషియన్లు ఈ సమస్యను పరిశీలిస్తున్నారు. మాకు సమాచారం అందిన వెంటనే అప్డేట్ ఇస్తాం' అని అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అప్డేట్ తర్వాత క్రాష్ అయిన కమ్యూనికేషన్ సిస్టమ్
సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం, అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను అనుసంధానించే ప్రైవేట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో తాజాగా ఓ అప్డేట్ చేశారు. ఆ తర్వాత సిస్టమ్ దానంతటఅది రీబూట్ అయింది. కానీ అదే ప్రక్రియలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఎల్-3 హారిస్ కంపెనీ ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.
అమెరికా హోంసెక్యూరిటీ మంత్రి మార్క్వెన్ ములిన్ వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎలాంటి కుట్ర లేదా అమెరికాపై ఉద్దేశపూర్వక దాడికి సంబంధించి సంకేతాలు కనిపించలేదని అన్నారు. ఇది టెలికమ్యూనికేషన్ సిస్టమ్‌లో వచ్చిన సాంకేతిక లోపం అని భావించి.. ముందుజాగ్రత్తగా అన్ని విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గాల్లో ఉన్న విమానాలపై నిఘాఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 ప్రకారం, దేశవ్యాప్తంగా విమానాలపై నిషేధం విధించిన సమయంలో సుమారు 3100 విమానాలు అమెరికన్ ఎయిర్‌పోర్టుల వైపు వస్తున్నాయి. ఆల్రెడీ బయలుదేరిన విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవుతాయని, ఏ ప్రయాణికుడి భద్రత విషయంలో రాజీ పడబోమని ఆయన హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ విమానాలకు కొన్ని మార్గాల్లో మినహాయింపు
అమెరికా తూర్పు తీరంనుంచి బయలుదేరే అంతర్జాతీయ విమానాలకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. అలాగే జాక్సన్విల్, మియామి, హ్యూస్టన్, సాన్ జువాన్ నుంచి కొన్ని విమానాలకు దక్షిణ దిశగా మెక్సికో గల్ఫ్, అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారని నివేదికలు చెబుతున్నాయి.
పెద్ద ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల కష్టాలు
విమానాలపై నిషేధం ప్రభావం అమెరికాలోని పలు ప్రధాన ఎయిర్ పోర్టులైన బోస్టన్, అట్లాంటా, మియామి, పిట్స్బర్గ్, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్, బాల్టిమోర్ సహా ఇతర విమానాశ్రయాల్లోనూ కనిపించింది. విమానాల నిర్వహణలో ఆలస్యం కారణంగా ప్రయాణికులు చాలా గంటల నుంచి వేచి ఉండాల్సి వచ్చింది. శుక్రవారం రోజే చికాగోలోని ఓ'హేర్ ఇంటర్నేషనల్, మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో పరికరాల లోపం కారణంగా విమానాల సర్వీసులు నిలిపివేశారు.
2023లో కూడా నిలిచిపోయిన విమాన సర్వీసులు
అమెరికాలో ఇంతకుముందు 2023 జనవరిలో కూడా FAA సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు విమానాలపై నిషేధం విధించారు. ఆ సమయంలో విమాన సిబ్బందికి అవసరమైన అలర్ట్‌లు పంపే సిస్టమ్ రాత్రి వేళ నిలిచిపోయింది. దాంతో డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
