PM Narendra Modi | US రాయబారి నామినేట్ సెర్గియో గోర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తన సమావేశాన్ని “అద్భుతం” అని వర్ణించారు. ఇది భారత్, అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం దిశగా పడుతున్న అడుగులను సూచిస్తుంది. చర్చల సందర్భంగా యూఎస్ అంబాసిడర్ గోర్ వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రక్షణతో సహా సహకారానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. భారతదేశ ఎగుమతులపై US విధించిన 50% సుంకాలు సహా కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఆయన వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తు గురించి గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉమ్మడి నిబద్ధతను ప్రస్తావించారు.

Continues below advertisement

అమెరికా రాయబారి సెర్గియే గోర్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ట్రంప్‌తో తనతో ప్రధాని మోదీ ఉన్న ఒక ఫ్రేమ్ చేసిన ఫోటోను పంపించారు. ఇది ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తుంది. “భారతదేశానికి US రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్‌ను తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన పదవీకాలం భారత్, అమెరికా సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నాను,” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

జైశంకర్‌తో అమెరికా దౌత్యవేత్త భేటీ

ప్రధానిని కలవడానికి ముందు అమెరికా అంబాసిడర్ గోర్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య దౌత్యపరమైన చర్చల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ట్రంప్ భారతదేశ ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో  రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై అదనంగా విధించిన 25 శాతం టారిఫ్ కూడా ఉంది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ చర్యలను “అన్యాయం, అహేతుకం” అని పేర్కొంది.

మోదీని గ్రేట్ ఫ్రెండ్‌గా అభివర్ణించిన ట్రంప్ 

టారిఫ్ వివాదం కొనసాగుతున్నప్పటికీ.. ప్రధాని మోడీని ట్రంప్ “గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు”గా భావిస్తున్నారని అమెరికా దౌత్యవేత్త గోర్ తెలిపారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఇటీవలి ఫోన్ సంభాషణలు ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో పురోగతికి ఆశలు రేపాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారతదేశం, అమెరికా నిరంతరం చర్చలు జరుపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. 

“ఇరు దేశాల మధ్య చర్చలు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి. మేం ఎలా ముందుకు సాగాలని యోచిస్తున్నామో త్వరలో మరింత సమాచారం అందిస్తామని” అని పీయూష్ గోయల్ దోహాలో మాట్లాడారు. భారత రైతులు, పాడి పరిశ్రమల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. ఇది UK, ఆస్ట్రేలియా, EFTA కూటమితో సంతకం చేసిన వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా ఉందన్నారు.

భారత్, అమెరికా కీలక చర్చలకు సిద్ధమవుతోంది. దౌత్యపరమైన చర్చలకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతలను గోర్ తెలిపారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి నవంబర్‌ను గడువుగా తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.