ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో వెనక్కి తగ్గని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు (Vladimir Putin) అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. రష్యాకు చెందిన బిలియనీర్ల లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ప్రైవేటు జెట్లను సీజ్ చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) చెప్పారు. మంగళవారం ఆయన చట్టసభలో ప్రసంగిస్తూ రష్యా విషయంలో తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు (Ukraine Russia War) ఆపకపోతే ఆ దేశం తీవ్రమైన ఆర్థికపర ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై దాడి విషయంలో ప్రపంచమంతా పుతిన్‌నే బాధ్యుడిగా చూస్తోంది. యూరోపియన్ యూనియన్‌లోని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి మొత్తం 27 సభ్య దేశాలు కూడా పుతిన్ చర్యను తప్పుబడుతున్నాయని గుర్తు చేశారు. ఆఖరికి స్విట్జర్లాండ్ కూడా ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతూ రష్యాపై ఒత్తిడి కలిగిస్తోందని అన్నారు.


‘‘పుతిన్ ఇప్పుడు ప్రపంచం నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా వేరయ్యారు. యురోపియన్ యూనియన్‌లోని మా మిత్రదేశాలతో కలిసి, మేం ప్రస్తుతం శక్తివంతమైన ఆర్థిక ఆంక్షలను ఆ దేశం;[ అమలు చేస్తున్నాం. రష్యా అతిపెద్ద బ్యాంకుల నుంచి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మేం తొలగిస్తున్నాం. రష్యా సెంట్రల్ బ్యాంక్ నుంచి ఆ దేశ కరెన్సీ అయిన రూబుల్‌ను రక్షించకుండా నిరోధించడం, పుతిన్ గతంలో ఏర్పర్చిన 630 బిలియన్ డాలర్ల యుద్ధ నిధిని నిరుపయోగంగా మార్చడం వంటి ఆంక్షలు అమలు చేయబోతున్నాం. రాబోయే సంవత్సరాల్లో రష్యా ఆర్థిక బలాన్ని క్షీణింపజేసి, సైన్యాన్ని బలహీనపరిచి, రష్యా ప్రాబల్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాం.’’ అని జో బైడెన్ హెచ్చరించారు.


‘‘రష్యాలో ఈ హింసాత్మక పాలన మొదలైన నాటి నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను అక్రమంగా సంపాదించిన రష్యన్ కుబేరులు, అవినీతి నాయకులు ఇక ఉండరు. అమెరికాలో స్థిరపడ్డవారి విషయంలో న్యాయ విభాగం వారి నేరాలను గుర్తించేందుకు ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. మేము వారి విలాసవంతమైన ఓడలు, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు, ప్రైవేట్ జెట్‌లను గుర్తించి సీజ్ చేసేస్తాం. మీ అక్రమ సంపాదన కోసం మేం వస్తున్నాం. అంతేకాక, అన్ని రకాల రష్యన్ విమానాలను అమెరికా గగన తలంలోకి అనుమతించబోం. భవిష్యత్తులో రష్యాను మరింత ఏకాకిని చేయబోతున్నాం.’’


‘‘రష్యన్ కరెన్సీ అయిన రూబుల్ ఇప్పటికే దాని విలువలో 30 శాతం పడిపోయింది. రష్యా స్టాక్ మార్కెట్ కూడా దాదాపు దాని విలువలో 40 శాతం దిగజారింది. రష్యా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. దీనికి అందరూ పుతిన్‌ను మాత్రమే నిందిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.


ఈ ప్రసంగం సందర్భంగా ఓ చోట జో బైడెన్ నోరు జారారు. ఉక్రేనియన్ ప్రజలు అనాల్సిన చోట ఇరానియన్ ప్రజలు అన్నారు. ‘‘పుతిన్ కీవ్ నగరాన్ని యుద్ధ ట్యాంకులు, శతఘ్నులతో చుట్టుముట్టవచ్చు. కానీ, ఇరానియన్ ప్రజల మనసులు మాత్రం గెల్చుకోలేరు’’ అని బైడెన్ అన్నారు.