UK New Cabinet : బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునక్ కింగ్ చార్లెస్-II తో సమావేశమైన గంటలోపు తన పని ప్రారంభించారు. సవాళ్ల పీఠం ఎక్కిన సునక్ ముందుగా మంత్రుల నుంచి ప్రారంభించారు.  తన కొత్త క్యాబినెట్ ప్రకటనకు ముందస్తుగా లిజ్ ట్రస్ మంత్రుల బృందంలోని పలువురు సభ్యులను రాజీనామా చేయవలసిందిగా ఆయన కోరినట్లు తెలుస్తోంది.  ఇప్పటికి నలుగురు మంత్రులను పదవి నుంచి తప్పించినట్లు సమాచారం.  వీరిలో బిజినెస్ సెక్రటరీ జాకబ్ రీస్-మోగ్, జస్టిస్ సెక్రటరీ బ్రాండన్ లూయిస్, వర్క్ అండ్ పెన్షన్స్ సెక్రటరీ క్లో స్మిత్,  డెవలప్‌మెంట్ మినిస్టర్ విక్కీ ఫోర్డ్ ఉన్నట్లు యూకే మీడియా వర్గాలు తెలిపాయి. క్వాసి క్వార్టెంగ్ స్థానంలో వచ్చిన జెరెమీ హంట్ ఆర్థిక మంత్రిగా కొనసాగుతారని యూకే ప్రధాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.






ఆర్థిక మాంద్యం అంచున 


ప్రధానమంత్రిగా తన మొదటి ప్రసంగంలో రిషి సునక్ ప్రభుత్వ ఎజెండాలో "ఆర్థిక స్థిరత్వం, కచ్చితత్వం" ఉంటాయని హామీ ఇచ్చారు. "మీ నమ్మకం సంపాదించాను. ఇక మిమ్మల్ని సంపాదించుకుంటాను" అని రిషి సునక్ తెలిపారు. గత ప్రధానుల తప్పులను సరిదిద్దడం ఒక చర్యగా చేపడతానన్నారు.  బలమైన NHS (నేషనల్ హెల్త్‌కేర్ సిస్టమ్), పాఠశాలలు, సురక్షితమైన వీధులు, సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడం, వారి స్థాయిని పెంచడం, ఉద్యోగాలను సృష్టించడం వంటి వాగ్దానాలను తన ప్రభుత్వం నెరవేరుస్తుందని సునక్ చెప్పారు. ప్రతి స్థాయిలో సమగ్రత, వృత్తి నైపుణ్యం  జవాబుదారీతనం కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. యూకే ప్రస్తుతం మాంద్యం వైపు వేగంగా పయనిస్తుందని, భారీ ఆర్థిక తిరోగమనాన్ని ఎదుర్కొంటోందన్నారు. 






కఠిన నిర్ణయాలు తప్పవు 


లిజ్ ట్రస్ తన మినీ బడ్జెట్ తర్వాత ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.  క్వాసీ క్వార్టెంగ్‌ను తొలగించిన తర్వాత ఆమె నియమించిన జెరెమీ హంట్ చేసిన U-టర్న్ ఆర్థిక గందరగోళాన్ని తిప్పికొట్టలేకపోయింది. బాండ్ దిగుబడులు పెరిగాయి. పౌండ్ రికార్డు స్థాయిలో డాలర్ తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. రిషి సునక్ ప్రధాని ప్రకటన రాగానే మార్కెట్లు కుదురుకున్నాయి.  కొంత వరకు ఆర్థిక పరిస్థితులు సర్దుకున్నాయి.  అయితే ప్రధాని రిషి సునక్ కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన కష్టమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇవాళ తన ప్రసంగంలో సునక్ భావోద్వేగంగా మాట్లాడారు.  కోవిడ్ సమయంలో ప్రజలను వ్యాపారాలను రక్షించడానికి ఫర్‌లాఫ్ వంటి పథకాలతో  చేయగలిగినదంతా చేశానన్నారు. తన అధికార పరిమితులకు లోబడి నిర్ణయాలు ఉంటాయన్నారు.  ఇవాళ యూకే ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడమే తన థ్యేయమని ప్రధాని రిషి సునక్ తెలిపారు.   


కొత్త మంత్రులు 



  • బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీకి కార్యదర్శిగా  గ్రాంట్‌షాప్స్ నియమితులయ్యారు

  • ఎంపీ సుయెల్లా బ్రవర్‌మన్  హోం శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు

  • ఎంపీ ఆలివర్ డౌడెన్ డచీ ఆఫ్ లాంకాస్టర్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు

  •  ఎంపీ నాధిమ్ జహావి పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా నియమితులయ్యారు

  • ఎంపీ బెన్ వాలెస్ రక్షణ శాఖ కార్యదర్శిగా మళ్లీ నియమితులయ్యారు

  • ఎంపీ జేమ్స్ తెలివిగా - విదేశాంగ, కామన్వెల్త్,  అభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు

  • ఎంపీ సైమన్ హార్ట్   ట్రెజరీకి పార్లమెంటరీ కార్యదర్శిగా (చీఫ్ విప్) నియమితులయ్యారు.

  •  ఎంపీ జెరెమీ హంట్  ఖజానా ఛాన్సలర్‌గా మళ్లీ నియమితులయ్యారు