Turkey New Name : కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు తెలిపే అతి కొద్ది దేశాల్లో ఒకటి టర్కీ. కారణాలేమైనా సంబంధం లేకపోయినా ఆ దేశ అధ్యక్షుడు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకుని పలు కామెంట్లు చేస్తూంటారు. భారత్ ఆయనకు ధీటుగా బదులిస్తూ ఉంటుంది. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడికి తన దేశం పేరు నచ్చకుండా పోయింది. టర్కీ అనే పేరు టర్కీ కోడిని పోలి ఉందని అనుకున్నారేమో కానీ వెంటనే మార్చాలనుకున్నారు. మరేం పేరు పెట్టాలా అని తీవ్రంగా ఆలోచించి... టర్కియా (Türkiye) అని మార్చేశారు.
మన దగ్గర సంఖ్యా శాస్త్రజ్ఞులు తమ దగ్గర వచ్చిన వారికి ఇదే చెబుతూంటారు. జీవితంలో సక్సెస్ కావాలంటే పేరు మార్చుకోవాలంటారు. పేరు మొత్తం మార్చుకోవద్దు కానీ స్పెల్లింగ్ మార్చుకోమని చెబుతారు. బహుశా... ఇలాంటి నమ్మకాలు టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కు ఉన్నాయేమో కానీ... పేరును అదే పద్దతిలో మార్చారు. ఇక నుంచి తమ దేశాన్ని టర్కియా (Türkiye) అని పిలువాలని దేశ ప్రజలను కోరారు.
అయితే తమ దేశ ప్రజలు అనుకుంటే సరిపోదుగా ప్రపంచం మొత్తం అలాగే గుర్తించాలి. అందుకే నేరుగా ఐక్యరాజ్యసమితికే రిక్వెస్ట్ పెట్టారు. టర్కీ ప్రభుత్వం పంపిన లేఖను స్వాగతిస్తున్నట్లు యూఎన్ తెలిపింది. పేరు మార్పు ప్రక్రియ ప్రారంభించి ముగించారు. యూఎన్‌కు లెటర్ అందిన రోజు నుంచే కొత్త పేరును అమలులోకి తీసుకువచ్చారు. టర్కిష్ ప్రజల సంస్కృతి, నాగరికత, విలువలకు కొత్త పేరు ప్రత్యామ్నాయంగా ప్రతిబింబిస్తుందని గతంలో అధ్యక్షుడు ఎర్డగోన్ ప్రకటించారు.
అంటే ఇక ప్రపంచంలో టర్కీ అనే దేశం లేదు.. టర్కియా అనే దేసం మాత్రమే ఉంది. పేరు మాత్రమే మారిందా.. లేకపోతే కశ్మీర్ విషయంలో ఆ దేశం విధానం కూడా మారుతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.