Trump suspends Green Card lottery Diversity Visa Program: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునే వేలాది మంది విదేశీయుల కలలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏటా సుమారు 55,000 మంది విదేశీయులకు గ్రీన్ కార్డులు అందించే ప్రతిష్టాత్మక డైవర్సిటీ వీసా (DV) లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలోకి వలసలను నియంత్రించడంతో పాటు, మెరిట్ ఆధారిత వలస విధానాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏమిటీ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్?
అమెరికాకు వలస వచ్చే వారిలో అంతా ఒకే రకమైన వారు ఉండకుండా వైవిధ్యం పెంచేందుకు 1990 నుండి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వెళ్లే దేశాల పౌరులకు ఈ లాటరీ పద్ధతి ద్వారా ఏటా 55,000 గ్రీన్ కార్డులను కేటాయించేవారు. ఎటువంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోయినా, కేవలం అదృష్టం బాగుండి లాటరీ తగిలితే అమెరికాలో స్థిరపడే అవకాశం ఉండటంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండేది.
మిగిలిన వీసాలపై ప్రభావం ఎలా ఉంటుంది?
డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపివేసినప్పటికీ, ఆ విభాగంలో మిగిలిపోయే వీసాలు ఇతర కేటగిరీలకు ఉద్యోగ లేదా కుటుంబ ఆధారిత వీసాలకు కలపరు. ప్రస్తుత చట్టాల ప్రకారం, ఈ ప్రోగ్రామ్ కింద కేటాయించిన 55,000 వీసాలు రద్దయితే, ఆ సంఖ్య ఆటోమేటిక్గా మెయిన్ గ్రీన్ కార్డ్ పూల్‌లో కలవదు. అంటే, ఉపాధి ఆధారిత లేదా కుటుంబ ఆధారిత వీసాల కోసం వేచి ఉన్న వారికి దీని వల్ల అదనపు కోటా లభించే అవకాశం లేదు.
నేరాలకు పాల్పడుతున్న డైవర్సిటీ వీసా గ్రీన్ కార్డు హోల్డర్లు
ఈ డైవర్సిటీ వీసా లాటరీ వల్ల దేశంలోకి వచ్చేవారికి ఎలాంటి నైపుణ్యాలు ఉండటం లేదు. పైగా నేరాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల బ్రౌన్ యూనివర్శిటీ లో కాల్పులు జరిపిన వ్యక్తి డైవర్సిటీ వీసా ద్వారానే దేశంలోకి వచ్చారు.
జాతీయ భద్రతను పటిష్టం చేయడంలో భాగంగానే ఈ లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటి తనిఖీలు లేకుండా అదృష్టం కొద్దీ వచ్చే వారి కంటే, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా భావిస్తోంది. సాధారణంగా భారతీయులు ఈ డైవర్సిటీ వీసా రేసులో ఉండరు. ఎందుకంటే భారత్ నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు ఉన్నాయి . కానీ, మొత్తం గ్రీన్ కార్డ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల వల్ల పరోక్షంగా నిబంధనలు మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.