Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బుధవారం ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని అమెరికా వాణిజ్య భాగస్వాములకు కొత్త సుంకాల రేట్లపై లేఖలు పంపిస్తోంది. ఈ విధంగా ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం నుంచి దిగుమతులపై సుంకాలు విధించే ప్రక్రియ కొనసాగింది. కొత్త సుంకం ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది. 

బుధవారం నాడు కొత్త సుంకాల రేట్లపై లేఖలు పంపిన ఏడు దేశాలలో ఫిలిప్పీన్స్ కూడా ఉంది. ఈ దేశం అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా పేరు ఉంది. ఇక్కడ నుంచి గత సంవత్సరం అమెరికాకు 14.1 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ సంఖ్య చైనా, యూరోపియన్ యూనియన్ వంటి అమెరికా ఇతర వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే తక్కువగా ఉంది. బుధవారం నాడు ట్రంప్ సుంకాలు విధించిన దేశాల‌లో చాలా వరకు ఏప్రిల్‌లో 'విముక్తి దినోత్సవం' సందర్భంగా విధించిన సుంకాలకు సమానంగా ఉన్నాయి. అయితే, కొన్ని మార్పులు చేశారు. 

ఈ దేశాలకు ఉపశమనం లభించింది

ఫిలిప్పీన్స్ పై విధించే పన్ను రేటును  17 శాతం నుంచి 20 శాతానికి పెంచారు ట్రంప్ . అయితే మోల్డోవాపై సుంకాన్ని 31 శాతం నుంచి 25 శాతానికి, ఇరాక్ పై 39 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు, శ్రీలంక ఎగుమతులపై సుంకాన్ని 44 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీనితో పాటు, ట్రంప్ అల్జీరియాపై 30 శాతం, బ్రూనైపై 25 శాతం, లిబియాపై 30 శాతం సుంకం విధించారు. ఇది కాకుండా, సోమవారం నాడు ట్రంప్ జపాన్, దక్షిణ కొరియాపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. 

వివిధ దేశాలపై విధించిన పన్నులు ఇలా ఉన్నాయి

కీలకమైన అమెరికా మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియా,  ఇండోనేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌తో సహా 22 దేశాలు ట్రంప్ లేఖలను అందుకున్నాయి. దేశాల పూర్తి జాబితా, వాటిపై విధించిన సుంకాలు ఇక్కడ చూడొచ్చు

  • శ్రీలంక - 30%
  • లిబియా - 30%
  • ఇరాక్ - 30%
  • అల్జీరియా - 30%
  • ఫిలిప్పీన్స్ - 20%
  • బ్రూనై - 25%
  • మోల్డోవా - 25%
  • మయన్మార్ - 40%
  • లావోస్ - 40%
  • కంబోడియా - 36%
  • థాయిలాండ్ - 36%
  • బంగ్లాదేశ్ - 35%
  • సెర్బియా - 35%
  • ఇండోనేషియా - 32%
  • బోస్నియా అండ్‌ హెర్జెగోవినా - 30%
  • దక్షిణాఫ్రికా - 30%
  • జపాన్ - 25%
  • కజకిస్తాన్ - 25%
  • మలేషియా - 25%
  • దక్షిణ కొరియా - 25%
  • ట్యునీషియా - 25%
  • బ్రెజిల్ - 50%

ఒక లేఖ అంటే ఒక ఒప్పందం 

మంగళవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, సుంకాలకు సంబంధించి చాలా దేశాలతో జరిపే చర్చల్లో భాగంగా  లేఖ వెళ్తున్నాయని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, ''ఒక లేఖ అంటే ఒక ఒప్పందం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మేము 200 దేశాలతో సమావేశం నిర్వహించలేము... మీరు దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవాలి.''

కొత్త సుంకాల రేట్లపై లేఖలు పంపే ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది, ట్రంప్ సోమవారం నాడు ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు, దీనిలో దాదాపు 60 వాణిజ్య భాగస్వాముల ఎగుమతులపై 10 నుంచి 50 శాతం సుంకాలు విధించడంతోపాటు పరస్పర సుంకాలు విధించే తేదీని అధికారికంగా వాయిదా వేశారు.  

ట్రంప్ ఏప్రిల్ 9 నుంచి కొంతకాలం పాటు పరస్పర సుంకాలు విధించాలని ప్రకటించారు, ఆ తర్వాత అధ్యక్షుడు దీనిని జులై 9 వరకు నిలిపివేశారు. సోమవారం నాటి ఉత్తర్వు దాని గడువును ఆగస్టు 1 వరకు పొడిగించింది.