Trump ready to go back to war as ceasefire end: ఇరాన్ ,  అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య యుద్ధం 53వ రోజుకు చేరుకుంది. ఒకవైపు కాల్పుల విరమణ గడువు సమీపిస్తున్నప్పటికీ, శాంతి దిశగా అడుగులు పడకపోగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, దిగ్బంధనం కారణంగా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. బెదిరింపుల నీడలో చర్చలు జరపలేము  అని టెహ్రాన్ తేల్చి చెప్పడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంలో తన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇరాన్ రేవులపై విధిస్తున్న నావికా దళ దిగ్బంధనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించేది లేదని ఆయన స్పష్టం చేశారు.  ఇరాన్ తన మొండి వైఖరి వీడి,  అణు ఒప్పందం విషయంలో మా డిమాండ్లకు లొంగి వచ్చే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుంది  అని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిఘా పెంచాయి. ఇరాన్ ,  అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు క్లిష్టతరంగా మారాయి. రెండు దేశాల మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చడం ప్రస్తుతానికి సాధ్యం కావడం లేదు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు అమెరికాను అమెరికా తీవ్రవాద ధోరణితో వ్యవహరిస్తోందని, నిత్యావసరాలను కూడా అడ్డుకోవడం మానవత్వానికి విరుద్ధమని మండిపడుతున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే బారెల్‌కు 94 డాలర్లకు పైగా చేరుకున్నాయి. ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా వంటి దేశాలు కూడా ఈ యుద్ధం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.   

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ , రష్యా వంటి దేశాలు పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించాయి. ఇరాన్‌లో ఇంటర్నెట్ ఆంక్షలు, ఆహార కొరత వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారతాయేమోనన్న భయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.