Gaza : గాజా అనే మాట ఎక్కడైనా... ఎప్పుడైనా వినిపిస్తే ఆ తర్వాత వచ్చే న్యూస్ బాంబుదాడులు, విధ్వంసం, రక్తపాతం మాత్రమే. అదో కల్లోలిత ప్రాంతం. అక్కడ నివసించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు. అయితే ట్రంప్ ఇప్పుడు గాజా సమస్యను పరిష్కరించడానికి ఓ ప్రతిపాదన చేశారు. గాజాను శాశ్వత లేదా దీర్ఘకాలిక ప్రాతిపదికపై స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పక్కన కూర్చుని ఉండగానే ప్రకటించారు. నెతన్యాహూ కూడా ఆ దిశలో ప్రయత్నాలు జరగాలన్నారు. ట్రంప్ ఆషామాషీగా అన్నారా లేకపోతే నిజంగానే స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ ప్రారంభమయింది.
అసలు గాజా వివాదం ఏమిటంటే ?
యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అని నమ్ముతారు. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేసింది. కానీ సాధ్యం కాలేదు. అప్పట్నుంచి అనేక యుద్ధాలు జరిగాయి. తూర్పు జెరూసెలం, గాజా, వెస్ట్ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్‌కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతుంటాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. అవి చిన్న చిన్న దాడులు కాదు.. పెద్దపెద్ద బాంబులే.
అమెరికా సాయంతోనే ప్రస్తుతం శాంతి 1967లో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ముందు 19 ఏళ్లపాటు ఈజిప్ట్ గాజాను ఆక్రమించుకుంది. ఇప్పటికీ అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నప్రాంతంగానే భావిస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ వివాదం లేవనెత్తుతోంది. 2005లో యూదు సెటిల్‌మెంట్లను ఏకపక్షంగా కూల్చివేసి, మిలటరీని వెనక్కి పిలిచిన తర్వాత ఆక్రమణ పూర్తయిందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల్లో మూడోవంతు గాజాను స్వతంత్ర పాలస్తీనాలో భాగంగా గుర్తించినప్పటికీ అమెరికా మాత్రం అంగీకరించలేదు. ఇజ్రాయెల్ అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఎవరూ లోపలకు రాలేరు. బయటకు వెళ్లలేరు. గాజా, ఇజ్రాయెల్ మధ్య ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా జోక్యంతోనే జరిగింది. రెండవ దశ గురించి చర్చలు జరగాల్సి ఉంది. ఆ స్థితిలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
టూరిజం ప్రాంతం చేద్దామని ట్రంప్ ప్రతిపాదన
ట్రంప్ చెప్పిన దాని ప్రకారం గాజా నుంచి పాలస్తీనా ప్రజలను పూర్తిగా ఇతర దేశాలకు తరలిస్తారు. అందుకోసం అవసరమైతే అమెరికన్ సేనలను వినియోగిస్తారు. అక్కడ ప్రస్తుతం గల శిథిలాలను, మందు పాతరలను, ఆయుధాలను తొలగించి గాజాను ఒక మంచి బీచ్ రిసార్టుగా తయారు చేస్తుంది. అక్కడ మంచి వినోద విహారాలతోపాటు చాలా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. పాలస్తీనియన్లు కోరుకున్న పక్షంలో ఇతరులతో పాటు వారు కూడా కొందరుండి పనులు చేసుకోవచ్చు. ఆ విధంగా అందరికీ అది ఒక టూరిజం మక్కా వంటిదవుతుందని ట్రంప్ ప్రకటించారు. గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున సైన్యాన్ని దించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివాటినే తాను వ్యతిరేకిస్తున్నట్టు చాలా కాలంగా ట్రంప్ చెబుతున్నారు. ప్రాపర్టీ డెవలపర్‌గా కోట్లు సంపాదించిన ట్రంప్, ఆ అనుభవంతో కచ్చితమైన పరిశీలన చేశారు. అయితే అటు యూదులు..ఇటు అరబ్బులు పవిత్ర ప్రాంతంగా భావించే చోట.. ట్రంప్ బీచ్ రిసార్టును చూడటమే విచిత్రం.. ట్రంప్ అంతే అదో టైపు !