అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. గురువారం (ఆగస్టు 24, 2023) జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటీలో ఆయన్ని అరెస్టు చేశారు. ట్రంప్ లొంగిపోయే అవకాశం కోర్టు కల్పించింది.


2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకోవడం, కుట్ర చేసేందుకు యత్నించారన్న అభియోగాలతో ఆయనపై కేసులు నమోదు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయన లొంగిపోయేందుకు కోర్టు అవకాశం కల్పించింది. దీంతో జార్జియా జైల్‌ వద్ద పోలీసుల ఎదుట ట్రంప్ లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత రెండు లక్షల డాలర్ల పూచీకత్తు సమర్పించి బెయిల్ తీసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. 


కోర్టు ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకున్న ట్రంప్‌... బెయిల్ ప్రక్రియ పూర్తి చేసుకొని 24వ తేదీని లొంగిపోయారు. సుమారు ఇరవై నిమిషాలు జైల్లో గడిపిన ట్రంప్‌... అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. 


కోర్టు ఆదేశాలతో ట్రంప్‌తోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 19 మందిని కూడా అరెస్టు అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం నాలుగుసార్లు అమెరికాలోని వివిధ కోర్టుల్లో లొంగిపోయారు ట్రంప్‌. ఈ ఏడాది ఏప్రిల్ లో తొలిసారి కోర్టులో లొంగిపోయారు.


అరెస్టు తర్వాత ట్రంప్ ఏమన్నారంటే.
ఫుల్టన్ కౌంటీలో అరెస్టు అయిన తరువాత షెరీఫ్ కార్యాలయంలో నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేశారు. సుమారు 20 నిమిషాలపాటు ఈ ప్రక్రియ సాగింది. అక్కడ బెయిల్ పై విడుదలైన తర్వాత విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అట్లాంటాలోని హార్ట్స్ ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. "నేను ఏ తప్పు చేయలేదు" అని ఒక లైన్ చెప్పారు.


అట్లాంటాలోని హార్ట్స్ ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ అమెరికా రాజకీయ చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. తనపై ఉన్న ఇతర కేసులపై ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఎన్నికలు పోటీ చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు.


ఏ షరతులతో ఆయనకు బెయిల్ వచ్చింది?
లొంగిపోవడానికి ముందు ట్రంప్ తనకు తానుగా 2 లక్షల డాలర్ల బాండ్ చెల్లించారు. దీంతో షరతులతో కూడా బెయిల్ వచ్చింది. సాక్షులను భయపెట్టకూడదని కోర్టు హెచ్చరించింది. తనకు వ్యతిరేకంగా ఉన్న నిందితులను బెదిరించడం, వారిని సంప్రదించడానికి ప్రయత్నించడం లాంటివి చేయొద్దని ఆదేశించింది.