Thailand ex cop horror: థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఒక మాజీ పోలీసు అధికారి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 22 మంది చిన్నారులు, 12 మంది పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు పలువురిని బందీలుగా కూడా తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ధాయ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఒక డే కేర్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. మధ్యాహ్న సమయంలో చిన్నారులు నిద్రిస్తున్న వేళ ఆయుధాలతో లోపలికి ప్రవేశించిన నిందితుడు, కత్తులు ,  తుపాకులతో దారుణానికి ఒడిగట్టాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన వారిని వెంటాడి మరీ చంపడం చూస్తుంటే నిందితుడు తీవ్రమైన ఉన్మాదంతో ఈ పని చేసినట్లు తెలుస్తోందని అక్కడి మీడియా చెబుతోంది. మరణించిన వారిలో రెండేళ్ల వయసున్న పసికందులు కూడా ఉండటం స్థానికులను కలచివేసింది.        

ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న నిందితుడు తన నివాసానికి వెళ్లి భార్య, బిడ్డను కూడా చంపి, ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు  తెలుస్తోంది. అయితే, దానికి ముందు కొంతమందిని బందీలుగా ఉంచుకుని పోలీసులతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాల్పుల సమయంలో అడ్డువచ్చిన వారిని కూడా నిందితుడు వదలకుండా కాల్చడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.       

 ఈ దారుణ ఉదంతంపై థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడు గతంలో మాదకద్రవ్యాల కేసులో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైనట్లుగా విచారణలో తేలింది.  నిందితుడి మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చింది.