Tehran skip talks With US: హార్ముజ్ జలసంధి  కేంద్రంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం అంచుకు చేరుకున్నాయి. అమెరికా నౌకాదళం ఒక ఇరాన్ సరుకు రవాణా నౌకను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో, ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ  ఒప్పందం ప్రమాదంలో పడింది. ఇరాన్ ఈ చర్యను  సముద్రపు దొంగతనం  గా అభివర్ణించడమే కాకుండా, త్వరలోనే గట్టి సమాధానం ఇస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అమెరికా నావికాదళం ఆదివారం రాత్రి హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ఉన్న  టౌస్కా అనే కార్గో నౌకను అడ్డుకుంది. ఆరు గంటల పాటు సాగిన ఉత్కంఠ తర్వాత, అమెరికా మెరైన్లు హెలికాప్టర్ల ద్వారా నౌకలోకి ప్రవేశించి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ చైనా నుండి బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి వెళ్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  అమెరికా ప్రకటించిన నౌకా దిగ్బంధనం తర్వాత జరిగిన మొట్టమొదటి భారీ సీజ్ ఇదే  

Continues below advertisement

 అమెరికా చర్యపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా తమ నౌకను హైజాక్ చేసిందని ఆరోపించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ వారం జరగాల్సిన రెండో రౌండ్ శాంతి చర్చల్లో పాల్గొనే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ మిలిటరీ కమాండ్ కూడా స్పందిస్తూ, తమ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాలలోని విద్యుత్ కేంద్రాలు, డీశాలినేషన్ ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరించింది.  

Continues below advertisement

 ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌పై తక్షణమే పడింది. చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చైనా విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిస్థితి మరింత చేయి దాటకముందే కాల్పుల విరమణను పాటించాలని కోరింది.  ప్రస్తుతం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఈ నౌక స్వాధీనంతో నీరుగారిపోయాయి. బుధవారంతో ముగియనున్న 15 రోజుల కాల్పుల విరమణ గడువు పొడిగింపుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొండితనం, ఇరాన్ ప్రతీకార హెచ్చరికల మధ్య పశ్చిమ ఆసియా మరోసారి రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.