Green Igwanas: "గ్రీన్ ఇగ్వానా " చూడగానే రాకాసి బల్లిని తలపించే ఈ జీవి తైవాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అక్కడి పంటలను మొక్కలను తినేస్తూ రైతులు పాలిట రాకాసిలా తయారైంది. దానితో మరో దారి లేక 1,20,000  వేల "గ్రీన్ ఇగ్వానా" లను చంపేయడానికి సిద్ధపడింది తైవాన్. ప్రకృతి సమతుల్యం కోసం ఈ నిర్ణయం తప్పదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. 

ఒక్కో ఇగ్వానా వేటకు 200 రూపాయలు గ్రీన్ ఇగ్వానాలు తైవాన్‌లో రెండు లక్షల వరకూ ఉంటాయని అంచనా. ఇవి అడవుల్లో బొరియలు చేసుకుని సమీపంలోని పంటలను నాశనం చేస్తున్నాయి. సాధారణంగా బల్లులుగాని తొండలుగాని పురుగుల్ని కీటకాలు తినేస్తుంటాయి. కానీ గ్రీన్ ఇగ్వానాలు పూర్తిగా శాకాహారులు. పంటలను, నాచు, చిన్న చిన్న మొక్కలను తింటూ బతుకుతాయి. సాధారణంగా మూడున్నర అడుగుల పొడవు ఉంటాయి ఈ జీవులు. తాము ఉండే ప్రదేశాన్ని బట్టి 5 లేదా 6 అడుగుల పొడవు వరకు కూడా పెరుగుతాయి.  చూడడానికి అచ్చం రాకాసి బల్లిలానే కనిపిస్తాయి. 

Also Read: ఇయిర్ ఫోన్లు పెట్టుకుని పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు.. యువతి మృతి

చిత్రం ఏంటంటే ఇవి చాలా శాంతంగా ఉండడంతోపాటు వీటి కలర్ అట్రాక్టివ్‌గా ఉండడంతో వీటిని పెంచుకోవడానికి సంపన్నులు ఎగబడతారు. కానీ దీనికి తగిన ఏర్పాట్లు చేయడం మాత్రం అందరి వల్ల కాదు. ఒక్కో ఇగ్వానా 80 నుంచి 100 గుడ్లు వరకూ పెడుతుంది. ఇలా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో లక్షా ఇరవై వేల ఇగ్వానాలను చంపేయడానికి వేటగాళ్లను రంగంలోకి దించింది తైవాన్. ఒక్కో ఇగ్వానా కు ఇండియన్ కరెన్సీలో 200 రూపాయలను బహుమతిగా ప్రకటించింది. 

లాటిన్ దేశాలకు చెందిన "గ్రీన్ ఇగ్వానా " ఇప్పుడు చాలా దేశాలకు పాకిపోయింది.  ఇగ్వానాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలతోపాటు దక్షిణ అమెరికాలో చాలా ఎక్కువగా ఇగ్వానాలు కనిపిస్తాయి. పెరు, బ్రెజిల్ లాంటి దేశాలు సహా చాలా ప్రాంతాల్లో వీటి ఉనికి ఉంది. ఇవి మంచి స్విమ్మర్లు కావడంతో తుపాన్‌లు వచ్చినప్పుడు నెమ్మదిగా ఇతర దేశాలకు పాకిపోయాయి. ఎక్కడో లాటిన్ దేశాల్లోనూ.. ఆఫ్రికన్ తీరాల్లోనో కనిపించాల్సిన ఇగ్వానాలు ఇప్పుడు థాయిలాండ్ సింగపూర్ తైవాన్ లాంటి సుదూర ప్రాంతాలకి విస్తరించాయి. వీటికున్న స్పెషాలిటీ ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల నుంచి ఎడారి వరకూ ఎక్కడైనా బతకగలవు.

మనుషులకు ఎలాంటి హానీ లేకపోవడంతో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే ఇవి తైవాన్‌లో పంటలను తినేస్తున్నాయి. వీటికి అక్కడ సహజ శత్రువులు లేకపోవడంతో విపరీతంగా పెరిగిపోతూ రైతుల పాలిట శాపంలా మారాయి. దానితో మరో దారి లేక ఇలా 1,20,000 ఇగ్వానాలను చంపేయాలని తైవాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: గాంధీబాబా జాతర, మహాత్మా గాంధీ వారసత్వాన్ని చాటుతోన్న గ్రామ ప్రజలు