SpaceX Crew 9 Left From Space For Earth  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలల పాటు చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్‌ విల్మోర్‌ తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఆస్ట్రోనాట్స్ ను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చే ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ 9 (SpaceX Crew 9)లోకి నలుగురు చేరుకున్నారు. 


అనంతరం స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ 9 క్యాప్సల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా విడిపోయింది. దీనినే అన్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం అయిందని అంటారు. అన్ డాకింగ్ జరగడానే నలుగురు వ్యోమగాములను భూమి మీదకు తీసుకువచ్చే స్పేస్ షటిల్ ప్రయాణం ప్రారంభించింది. తమ స్థానంలో ఐఎస్ఎస్ లో బాధ్యతలు నిర్వహించే కొత్త ఆస్ట్రోనాట్స్ బృందానికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ టీమ్ బైబై చెప్పేసింది. హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు ప్రారంభం కాగా, ఐఎస్‌ఎస్‌ నుంచి క్యాప్సుల్ విడివడే ప్రక్రియ ఉదయం 10.35కు జరిగింది. హ్యాచ్ మూసివేత, తరువాత ఐఎస్ఎస్ నుంచి క్రూ డ్రాగన్ అన్ డాకింగ్ పూర్తి కావడంపై నాసా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 



వ్యోమగాముల 9 నెలల నిరీక్షణకు ఫలితం..


గత ఏడాది జూన్ నెలలో స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత భూమి మీదకు తిరిగి వస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA, ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూడ్ డ్రాగన్ 9 వ్యోమనౌకను ఐఎస్ఎస్ కు పంపించగా.. అది విజయవంతంగా ఇటీవల డాకింగ్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది జూన్ లో వెళ్లిన నాసా అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఎస్ఎస్‌కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు అలెగ్జాండర్‌ గుర్బనోవ్‌ (రష్యా), నిక్‌ హేగ్‌ (అమెరికా) సైతం క్రూ డ్రాగన్ 9న ద్వారా భూమికి తిరిగి వస్తున్నారు.




భావోద్వేగానికి లోనైన సునీతా విలియమ్స్


క్రూ9 అని పిలుచుకునే నలుగురు వ్యోమగాములున్న స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి బయలుదేరే ముందు సునీతా విలియమ్స్ భావోద్వేగానికి లోనయ్యారు. గత 9 నెలలుగా ఐఎస్ఎస్ తమ ఇల్లుగా చేసుకుని అక్కడే ఉంటున్న సునీతకు అంతరిక్ష కేంద్రాన్ని వీడాల్సి వచ్చిన సమయంలో కొంచెం ఎమోషనల్ అయ్యారు. తోటి వ్యోమగాములతో చిన్నపాటి ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. తమ స్థానంలో అక్కడ ఉండనున్న వ్యోమగాముల టీంకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ టీం ఆల్ ద బెస్ట్ చెప్పింది. రెండో దశ అయిన స్పేస్ క్యాప్సుల్ విజయవంతంగా ఎస్ఐఎస్ నుంచి విడివడి భూమికి బయలుదేరింది.


ఈ మిషన్ సక్సెస్ అయి బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు క్రూ9 డ్రాగన్ క్యాప్సుల్ భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 19న తెల్లవారుజామున దాదాపు 3.27 గంటలకు ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ ల్యాండ్ కానుంది. సునీతా, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములను టెక్నీషియన్లు, స్విమ్మర్లు వెళ్లి సురక్షితంగా బయటకు తీసుకురానున్నారు. ఆ క్షణాల కోసం అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.