cosmonaut stuck in space for political reasons | భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునితా విలియమ్స్, ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్ మోర్ ఇద్దరు అంతరిక్షంలో 8 రోజుల యాత్రకు వెళ్లి అక్కడే ఎనిమిది నెలలు పాటు ఉండాల్సిన పరిస్థితి. సాంకేతిక కారణాలతో నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, విల్ మోర్ లు అంతరిక్షంలో చిక్కుపోయారు. అయితే అంతరిక్ష కేంద్రంలో రాజకీయ కారణాలతో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ఉన్నారని మీకు తెలుసా ?
సునితా విలియమ్స్, విల్ మోర్ లు ఎందుకు ఆగారంటే...?
భారతీయ సంతతికి చెందిన సునితా విలియమ్స్ నాసా వ్యోమగామిగా, సహచర వ్యోమగారి విల్ మోర్ తో జూన్ ఆరో తేదీన ఐ.ఎస్.ఎస్ ( ఇంటర్నేషనల్ స్పెస్ సెంటర్) కు వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్స్ లో వెళ్లిన వీరు జూన్ 14వ తేదీన తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ క్యాప్సుల్ లో హీలియం లీకేజి కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీదకు రావడం ప్రమాదమని నాసా ప్రకటించింది.
ఒకవేళ స్టార్ లైనర్ క్యాప్సుల్ భూమి మీద సెఫ్ ల్యాండింగ్ అయ్యే అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయంగా వారిని కిందకు తెచ్చేందుకు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకను పంపి తెస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రయోగం 2025లో జరుగుతుందని, ఇద్దరు వ్యోమగాములు ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సిందేనని తెల్చి చెప్పింది. దీంతో వీరద్దరు మరో 8 నెలలు అంతరిక్ష కేంద్రంలో గడపాల్సిందే. సాంకేతిక కారణాలతో వీరద్దరు అక్కడ చిక్కుబడిపోయిన పరిస్థితి. అయితే సాంకేతిక కారణాలతో, అదీ వారి ప్రాణాల మీదకు వచ్చిన సమస్య కాబట్టి సునీతా విలిమ్స్ అండ్ విల్ మోర్ లు భూమి మీదకు తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే రీతిలో చరిత్రలో ఓ సారి రాజకీయ కారణాల వల్ల ఓ కాస్మోనాట్ భూమి మీదకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం...
అంతరిక్షంలోకి వెళ్లాక... వ్యోమగామి దేశమే మారిపోతే ?
అవును.. అంతరక్షంలోకి వెళ్లేటప్పుడు ఒక దేశ వ్యోమగామిగా వెళ్లిన కాస్మోనాట్ తిరిగి వచ్చేటప్పడు ప్రపంచం పటంలో తన దేశం ఉనికి లేకపోతే పరిస్థితి ఏంటి. తన దేశ పాస్ పోర్ట్ మారిపోతే... అతను భూమి మీద ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. ఇలాంటి సమస్యే ఎదురయి 312 రోజులు అంటే పది నెలలు అక్కడే ఉండిపోయిన వ్యక్తి గాధ ఇది.
అంతరిక్ష కేంద్ర మరమ్మతుల కోసం వెళ్లి అక్కడే.. ఆగిపోయిన సెర్గి క్రికలేవ్..
సెర్గి క్రికలేవ్ ఒకప్పటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా దేశానికి చెందిన వాడు. 1958 లో సోవియట్ యూనియన్ లో భాగమైన లెనిన్ గ్రాడ్ లో జన్మించారు. ఉన్నత చదువుల తర్వాత ఆయన వ్యోమగామిగా శిక్షణ పొందారు. 1988లో ఆయన తొలి సారి మిర్ స్పెస్ స్టేషన్ కు వ్యోమగామిగా వెళ్లారు. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంది. తర్వాత 1991 మే నెలలో మరో దఫా అంతరిక్ష కేంద్రంకు మరమ్మతుల కోసం అని వెళ్లారు. అయితే ఇదే సమయంలో సోవియట్ యూనియన్ లో అనేక రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అప్పటి సోవియట్ అధ్యక్షుడు మిఖాయెల్ గోర్బచేవ్ కమ్యూనిస్ట్ విధానాలకు విరుద్ధంగా నూతన ఆర్థిక విధానాలను తీసుకువచ్చారు. ఇది అమెరికా , యూరప్ దేశాల పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలకు అనుకూలంగా ఉండే పద్దతి. దీంతో కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర వ్యతిరకత వచ్చింది. అది గోర్బచేవ్ మీద తిరుగుబాటుకు కారణమైంది. తీవ్ర ఆర్థిక , రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ పరిణామాల కారణంగా డిసెంబర్ 26, 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. యూనైటెడ్ సోవియట్ యూనియన్ కాస్తా 15 దేశాలుగా విడిపోయింది. అయితే సెర్గి క్రికలెవ్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు మిర్ అంతరిక్ష కేంద్రంకు వచ్చినప్పిటీకీ వారు తిరిగి భూమి మీదకు వచ్చేసారు. చివరకు క్రికలెవ్ మాత్రమే మిర్ కేంద్రంలో ఉండాల్సి వచ్చింది.
క్రిక్ లేవ్ భూమి మీదకు రాకుండా ఉండేందుకు కారణాలేంటి...?
ఈ పరిస్థితుల్లో మిర్ అంతరిక్ష కేంద్రంలో ఒంటరిగా ఉన్న క్రికలేవ్ కు తిరిగి రావడానికి ప్రధాన ఆటంకంగా ఉన్నది రాజకీయకారణాలే. తాను యునైటెడ్ సోవియట్ పౌరుడిగా అంతరిక్షంలోకి వెళ్లిన క్రిక్ లెవ్, రాజకీయ, ఆర్థిక కారణాలతో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, 15 దేశాలుగా విడిపోవడంతో తాను ఏ దేశ పౌరుడో తేలని పరిస్థితి నెలకొంది. తాను పుట్టిన లెనిన్ గ్రాడ్ కాస్తా సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ గా మారింది. అంతరక్షంలోకి వెళ్లే ముందు తనను అక్కడికి పంపిన సోవియట్ యూనియన్ రష్యాగా మారిపోయింది.
వ్యోమగామిని పంపే కేంద్రం కాస్మాడ్రోమ్ రష్యా చేతిలో కాకుండా 1991 అక్టోబర్ 25న స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న కజకిస్తాన్ చేతికి మారింది. మిర్ కేంద్రం నుండి క్రికలేవ్ తిరిగి రావాలంటే మరో బ్యాచ్ వ్యోమగామి బృందం అక్కడకు చేరాలి. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత వ్యోమగామి వ్యవస్థే పలు దేశాలకు చేతులు మారిన పరిస్థితి. క్రికలేవ్ అంత శిక్షణ పొందిన వ్యోమగాములు రష్యా వ ద్ద లేని పరిస్థితి. దేశ విచ్చినం తో పాటు ఆర్థికంగా నిధుల కొరత. మిర్ కేంద్రం ను నడపే ఆర్థిక పరిస్థితి అప్పుడు రష్యాకు లేవు. మిర్ కేంద్రం నుండి క్రికలెవ్ వస్తే ఆ అంతరిక్ష కేంద్రం పనికిరాని స్థితిలోకి నెట్టబడుతుంది. అలా వదిలేస్తే అప్పటి వరకు పెట్టిన ఖర్చు, శాస్త్రవేత్తల శ్రమ వృధా అవుతుంది. మిర్ స్టేషన్ తిరిగి నిలబడాలంటే అనుభవజ్ఞుడైన కాస్మోనాట్ అక్కడే ఉండి మానిటర్ చేయాల్సిన అవరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే వ్యక్తి అయితే తాను అక్కడ ఉండి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంత మాత్రం అంగీకరించే వారు కాదు. కాని క్రిక్ లేవ్ మాత్రం స్పెస్ టెక్నాలజీ, స్పెస్ సంబంధిత విషయాల పట్ల ప్రేమ అతన్ని మిర్ స్టేషన్ ను వదిలి రావడానికి అంగీకరించలేదు. అతని భార్య ఎలీనా కూడా స్పెస్ కు సంబంధించిన గ్రౌండ్ స్టేషన్ లో పని చేసే యువతే.
తనకు ఓ కూతురు. కుటుంబం దూరమవుతుందని, లేదా తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని భావించకుండా ఆ కాస్మోనాట్ మిర్ లోనే ఉండి వేరే వాళ్లు వచ్చే వరకు పని చేయడానికి స్వచ్ఛంధంగా అంగీకరించారు. అయితే అక్కడి నుండి ఎప్పుడైనా వచ్చేందుకు సూయజ్ క్యాప్సుల్ అందుబాటులో ఉన్నా మిర్ స్టేషన్ కోల్పోవడం ఇష్టం లేని సెర్గీ క్రిక్ లేవ్ అక్కడే ఉండటానికి ఇష్టపడ్డారు. అయితే భూమి మీద రాజకీయ పరిస్థితులు, దేశ విభజన పరిస్థితులు మాత్రం క్రికలెవ్ కు రష్యన్లు చెప్పలేదు. తానే రేడియో చాట్ ద్వారా తన స్వంత పౌరులతో కాకుండా అతను ఉన్న కాలంలో ఇతర దేశస్థులతో ముచ్చటించి భూమి మీద సంగతులు తెలుసుకునేవాడు. తనతో వచ్చిన ఇద్దరు వ్యోమగాములు తనను వదిలి వెళ్లినా క్రికలేవ్ అంతరిక్షంలో ఒంటరిగా గడిపాడు. ఒంటరితనం వల్లే వచ్చే మానసిక సమస్యలు, స్పెస్ ఎక్కువ కాలం ఉండటం వల్ల వచ్చే క్యాన్సర్ ముప్పు, రేడియేషన్ ప్రభావం, శారీరక ఒత్తిడి తట్టుకోవడం, కాటరాక్ట్ సమస్యలు , గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వచ్చే శారీరక మార్పులు , ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను లెక్క చేయకుండా ఉండటం నిజంగా గొప్ప విషయమే.
చివరకు రష్యా ప్రభుత్వం, కొత్తగా అవతరించిన రిపబ్లిక్ కజకిస్తాన్ దేశ మధ్య నడిచిన చర్చల అనంతరం నిపుణులైన వ్యోమగాములు మిర్ స్టేషన్ కు చేరగా, క్రిక్ లెవ్ 1992 మార్చి 25వ తేదీన భూమి మీదకు రావడం జరిగింది. యూఎస్ఎస్ఆర్ దేశం నుండి అంతరిక్షంకు వెళ్లిన క్రిక్ లెవ్ వచ్చే సరికి ప్రపంచ పటంలో ఆ దేశం లేదు. తన మాతృదేశం రష్యాగా మారగా, తాను బైకనూర్ స్టేషన్ నుండి స్పేస్ సెంటర్ కు వెళ్లిన క్రిక్ లేవ్ తరిగి రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ దేశం లో కాలు పెట్టడం విశేషంగా చెప్పాలి. అలా రాజకీయ కారణాలతో క్రిక్ లేవ్ 312 రోజులు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఆ సమయంలో భూమిచుట్టూ 5 వేల సార్లు మిర్ స్టేషన్ ప్రదక్షిణాలు చేసింది. అంతరిక్ష కేంద్రం నుండి సముద్రాలు, భూ వాతవరణం, పిరమిడ్లు , గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసిన క్రిక్ లేవ్ తన దేశంలో జరిగిన పరిణామాలు చూడలేకపోయారు. యూఎస్ఎస్ ఆర్ ప్రపంచ పటంలో మాయమయి 15 దేశాలు అవతరించడం చూడలేకపోయారు. ఇది 1990 ల నాటి అంతరిక్షంలో చిక్కుకున్న సెర్గీ క్రిక్ లెవ్ సాహస యాత్ర. అదే రీతిలో ఇండియన్ సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, మరో నాసా వ్యోమగామి విల్ మోర్ లు క్షేమంగా భూమి మీదకు తిరిగి రావాలని కోరుకుందాం.