Sri Lanka Crisis: శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. నిన్న ఉన్న పరిస్థితి ఈ రోజు నాటికి మరింత దిగజారుతోంది. ఇవాళ ఉన్న గడ్డు కాలం, రేపు మరింత తీవ్రం అవుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక తాత్కాలిక  అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. నిరసనలను కట్టడి చేయడానికి, దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి బయట పడేసేందుకు ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. 


మాల్జీవులకు పారిపోయిన గొటబాయ..


అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడిన తర్వాత శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబికింది. కొలంబో వీధుల్లో వేలాది మంది ఆందోళన చేశారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే పదవి నుండి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పీఎం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. శ్రీలంకలో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కరుగా దేశాన్ని విడిచి పారిపోతున్నారు. దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి కష్టాల మధ్యే వారి స్వార్థంతో దేశాన్ని వీడుతున్నారు. అధ్యక్షుడు గొటబాయ మాల్దీవులకు పారిపోయారు. ప్రధాని పదవి నుండి రణిల్ విక్రమ సింఘే దిగిపోవాలని ఒక వైపు శ్రీలంక ప్రజలు ఆందోళన చేస్తుంటే.. ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిని చేశారు స్పీకర్ మహింద అభయవర్దన. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 


ఒక్కొక్కరుగా నిరసనకు మద్దతు..


రోజు రోజుకూ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఉద్యమం ఉద్ధృతం అవుతుంది. శ్రీలంక దివాళా తీయడానికి రాజపక్స కుటుంబం కారణమని శ్రీలంక వాసులు మండిపడ్డారు. మొదట ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన విముక్తి దుశాంత ఒక మౌన నిరసనకు ఫేస్ బుక్ వేదికగా పిలుపును ఇచ్చారు. కొలంబోలోని మహా దేవీ పార్క్ ఇందుకు వేదిక అయింది. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు దమనకాండ చేశారు. పోలీసుల దాడిలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఏప్రిల్ ఒకటి రోజున కేసుల్లో ఇరుక్కున్న వారికి మద్దతుగా అడ్వొకేట్ ముందుకు వచ్చారు. తర్వాత పలు మతాలకు చెందిన పెద్దలంతా నిరసలు చేశారు. క్రమంగా అన్ని వర్గాల ప్రజలు నిరసనలకు మద్దతు ఇచ్చారు. ఒక్కొక్కరుగా పోరులో పాల్గొంటూ తమ ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తూ వచ్చారు. 


పదవుల నుంచి దిగేవరకు ఆగని నిరసనలు..


క్రమంగా అన్ని వర్గాల మద్దతుతో ఉద్యమం ఊపందుకుంది. దేశ వ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. నిరసనలు మహోగ్రరూపంతో రావడంతో శ్రీలంక పాలకులు తగ్గక తప్పలేదు. రాజపక్స కుటుంబాన్ని పదవుల నుండి దించే వరకు నిరసనలు పెల్లుబికాయి. చివరికి వారిని పదవి నుండి దింపి దేశం  నుండి పారిపోయేలా చేశారు శ్రీలంక ప్రజలు. పీకల్లోతు సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను విడిచి బయట దేశాలకు వెళ్లిన వారు తమ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ దేశానికి డాలర్లు పంపుతున్నారు. అప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ ప్రజలు తాము సాయం చేశామని.. మీరూ సాయం చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.