Sri Lanka Crisis: శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజలు ఒక్క సారిగా తిరుగుబాటు చేయడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పారిపోవాల్సి వచ్చింది. అధ్యక్ష భవనంలోకి దూసుకు వచ్చిన ప్రజలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశంలోని ప్రముఖులంతా ప్రజలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు. అన్ని పార్టీల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన రాజకీయ నేతలకు సందేశం పంపారు. తన రాజీనామా విషయాన్న విక్రమ సింఘే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
రణిల్ విక్రమసింఘే కూడా ఇటీవలే ప్రదవి చేపట్టారు. మహిందా రాజపక్సే రాజీనామా తర్వాత పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి మాజీ ప్రధాని రణిల్ విక్రమిసంఘే అంగీకరించారు. అయితే ఆయన పదవి చేపట్టిన తర్వాత కూడా పరిస్థితులు మెరుగుపడలేదు సరి కదా మరింతగా దిగజారాయి. దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అధికారాలన్నీ అధ్యక్షుడి దగ్గరే ఉండటంతో ఆయన తీరుపై విమర్శలు పెరిగిపోయి.ఈ కారణంగా ఆయన ఇంటి ముట్టడికి ప్రజలు పిలుపునిచ్చారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ముట్టడించారు.
దేశంలో అంతకంతకూ ఆందోళనలు పెరిగిపోతూండటంతో అంతర్జాతీయంగా సాయం కోసం శ్రీలంక చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఐఎంఎఫ్ బృందం త్వరలో పర్యటించాల్సి ఉంది. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం నుంచి కూడా బృందం రావాల్సిఉంది . అయినప్పటికీ ప్రజల ఆందోళన ఉధృతం కావడంతో రాజీనామా చేయక తప్పలేదు.