Srilanka Crisis : శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పరారయ్యారు. ఆయన అధ్యక్ష భవనంలో లేరు. ఆయనను సైన్యం సురక్షిత ప్రాంతానికి తరలించిందా లేకపోతే... ఆయన ఇతర దేశాలకు వెళ్లారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కు తరలించినట్లుగా భావిస్తున్నారు. అధ్యక్ష భవనం చుట్టూ దృశ్యాలు గగుర్పొడుస్తున్నాయి. లక్షల మంది జనం అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు. కొంత మంది భవనంలోకి ప్రవేశించారు. శ్రీలంక జెండాలను ఎగురవేస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కావడం లేదు.
కొంత కాలంగా ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ప్రజాందోళనలు పెరిగిపోతున్నాయి. ఆందోళనకారులు ఏకంగా అధ్యక్షుడు నివాసంలోకి చొరబడ్డారు. కొలంబోలో ఉన్న అధ్యక్ష భవనంలోకి భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ఆందోళనకారులు తమ దాడుల్ని ముమ్మరం చేశారు. శ్రీలంక జాతీయ జెండాలు, హెల్మెట్లను పట్టుకున్న వేలాది మంది.. ఇవాళ ఉదయం అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ వాళ్లంతా అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. కానీ ఆగ్రహంతో ఉన్న నిరసనకారుల్ని నిలువరించలేకపోయారు.
శ్రీలంకలో తీవ్ర స్థాయిలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఇంధనం, ఆహారం, మెడిసిన్ దిగుమతులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఏడు దశాబ్ధాల తర్వాత లంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. శనివారం జరిగే నిరసన ప్రదర్శన కోసం రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.