Spanish Man Arrest: లైవ్‌లో ఓ మహిళా జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తుండగా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్పెయిన్ లో జరగ్గా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పానిష్ వ్యక్తిని మ్యాడ్రిడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇసా బలాడో అనే జర్నలిస్టు మ్యాడ్రిడ్ లో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఛానల్ క్యూట్రో కోసం పని చేస్తున్న ఆమె.. ఓ దోపిడీకి సంబంధించి వార్త గురించి లైవ్ ఇస్తున్నారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఆ వ్యక్తి తనను వెనక నుంచి తాకాడు. ఇదంతా.. కెమెరాలో రికార్డు అయింది.


లైవ్ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేసిన చర్య వల్ల అయోమయానికి గురైన మహిళా జర్నలిస్టు ఇసా బలాడో.. అంతలోనే తేరుకుని తన లైవ్ ను కొనసాగించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని అంతా రిపోర్ట్ చేశారు. ప్రోగ్రామ్ హోస్ట్ నాచో అబాద్ అనే స్టూడియోలో ఉన్న జర్నలిస్టు ఈ విషయంపై స్పందించారు. మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించమని కోరుతూనే.. అతను మిమ్మల్ని వెనక నుంచి తాకాడా అని అడిగారు. దానికి ఇసా బలాడో అవును అని సమాధానం చెప్పారు. 


కెమెరాలో అతని ముఖాన్ని చూపించాలని, అతడో ఇడియట్ లా కనిపిస్తున్నాడని హోస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసా బలాడో ఆ వ్యక్తి వైపు తిరిగి అతడు చేసిన పనిపై ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి తానేం తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. అనంతరం మహిళా రిపోర్టర్ జుట్టును తాకుతూ వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి చేసిన చర్యలన్నీ లైవ్ లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మ్యాడ్రిడ్ పోలీసులు స్పందించారు.






విధుల్లో ఉన్న మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో అతగాడిని అరెస్టు చేశారు. అతడి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తున్న వీడియోను అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. టీవీ షో లైవ్ ఇస్తున్న సమయంలో ఓ మహిళా రిపోర్టర్ ను లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్టు చేశామని ఆ వీడియోపై రాసుకొచ్చారు. 






ఈ ఘటనపై సదరు టీవీ యాజమాన్యం స్పందించింది. ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని, అలాంటి వ్యక్తులపై పోలీసులు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది.